Begin typing your search above and press return to search.

కేటీఆర్ వ్యాఖ్యలు.. కొత్త కలకలానికి తెర తీస్తుందా?

By:  Tupaki Desk   |   14 Feb 2020 1:30 PM GMT
కేటీఆర్ వ్యాఖ్యలు.. కొత్త కలకలానికి తెర తీస్తుందా?
X
మీ నాన్నకు నలుగురు కొడుకులు. పెద్దోడికి చివరోడికి మధ్య వయసు తేడా పదిహేనేళ్లు. ఆర్థిక కారణాలతో పెద్దోడు పెద్ద చదువుకోకుండానే ఇంటి బరువు మోసేందుకు చిన్న ఉద్యోగంలో చేరి.. మిగిలిన తమ్ముళ్లకు దన్నుగా నిలిచాడు. చిన్నోడు చదువు పూర్తి కావటం.. బాగా చదువుకొని ఉండటం వల్ల ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చేసింది. భారీగా జీతం. ఇంట్లో నలుగురు ఉన్నా.. ఇద్దరు అన్నలు సంపాదించే దాని కంటే చిన్నోడి ఆదాయమే ఎక్కువ. రెండేళ్లు గడిచాయి. ఉమ్మడి కుటుంబంలో రూల్ ప్రకారం తనకొచ్చే జీతం మొత్తం నాన్న చేతిలో పెట్టాలి. ఇంటి అవసరాల ప్రకారం ఎవరికెంత డబ్బులు ఇవ్వాలన్నది నాన్న ఇష్టం.

అదేమీ ఇప్పటికిప్పుడు పెట్టిన రూల్ కాదు. పెద్దోడు ఇంటి బాధ్యతల బరువు మోసే రోజు నుంచి వస్తున్న అలవాటు. నెల మొదలు కాగానే వచ్చే జీతం మొత్తం నాన్న చేతికి ఇవ్వటం.. ఆయన ఇచ్చే కొద్దిపాటి డబ్బులు తిరిగి ఇవ్వటం అస్సలు నచ్చట్లేదు. ఈ కారణంతో మంచి బట్టలు కొనుక్కోలేకపోవటం.. తన మిగిలిన స్నేహితుల మాదిరి కారు కొనలేకపోవటం లాంటివి అతడ్ని బాధిస్తున్నాయి. రెండేళ్ల తర్వాత.. ఒక నెల చిన్నోడు బరస్ట్ అయ్యాడు. ఇంట్లో ఇద్దరు సంపాదించే దాని కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. నా ఖర్చులకు నాన్న ఇచ్చేది ఏ మాత్రం సరిపోవటం లేదు. ఇంత అన్యాయమా? కష్ట పడేది నేను.. ఖర్చు చేసేది ఇంటికా? అంటూ ఫైర్ అయ్యాడు.

ఈ కథంతా చదివినప్పుడు చిన్నోడి మీద మీ ఫీలింగ్ ఏమిటి? పెద్దోడు గురించి మీరేమనుకుంటున్నారు? ఈ కథలోని తండ్రి క్యారెక్టర్లో కేంద్రం ఉంటే.. చిన్నోడి పాత్రను తెలంగాణ రాష్ట్రం లాంటి డెవలప్ అవుతున్న రాష్ట్రాల్ని చెప్పాలి. దేశం అన్నాక.. అందులో ఉండే రాష్ట్రాలు అన్నాక అన్ని ఒకేలా ఉండవు. ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది. అలా ఉండే రాష్ట్రాల్ని.. వారి అవసరాల్ని తండ్రిలా చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. ఈ క్రమంలో ధనిక రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయానికి.. వారికి తిరిగి ఇచ్చే డబ్బులకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. అప్పుడే కదా దేశం నడిచేది.

సరిహద్దు రాష్ట్రాల్లో ఉండే సమస్యలు.. ఆంధ్రా.. తెలంగాణ.. తమిళనాడు.. కర్ణాటక.. కేరళ లాంటి రాష్ట్రాల్లో ఉండవు కదా? కశ్మీర్ సరిహద్దుల్లో ఉండే గ్రామాల్లో పరిస్థితుల్ని మన అసలు ఊహించగలమా? అదే సమయంలో దేశానికి ఒక మూలన ఉండే.. ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? అన్ని తెలంగాణ మాదిరి ఎక్కువ ఆదాయాన్ని ఇవ్వలేవు. అలా అని.. పన్నుల వాటా తాము కోరుకున్నంతగా ఇవ్వకపోతే చాటు.. కేంద్రం మీద వ్యాఖ్యు చేయటం.. తమ లాంటి ధనిక రాష్ట్రాలు జనరేట్ చేసే ఆదాయంతోనే కేంద్రం నడుస్తుందన్నట్లుగా చేసే వ్యాఖ్యలు ఏ మాత్రం హర్షనీయం కాదు. ఒకవేళ.. అలాంటి వ్యాఖ్యలు చెవికి ఇంపుగా అనిపిస్తే.. తప్పుడు ట్రాక్ లో వెళ్లినట్లే.

దేశం అనేది ఒక కుటుంబమైనప్పుడు.. అందులోని రాష్ట్రాలు అన్నదమ్ములు. ఒక అన్న ఒకలాంటి ఆర్థిక పరిస్థితి. ఒక తమ్ముడిది మరోలాంటి పరిస్థితి. అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండాలే కానీ.. ఆదాయం ఎక్కువగా జనరేట్ చేసే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి? నిధుల కేటాయింపు ఎక్కువ జరగాలన్న వాదనను తెర మీదకు తెస్తే.. సరిహద్దు రాష్ట్రాలకు ఉండే భద్రతా సమస్యలక సంబంధించిన ముప్పును.. దేశం మధ్యలో ఉండే రాష్ట్రాలు ఆ ముప్పును షేర్ చేసుకోవాలన్న వాదనను తెస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది? అలానే ఎక్కువ పన్ను చెల్లిస్తామన్న వాదనలో పస లేదని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పాత జిల్లాల్నే తీసుకుందాం. మొత్తం పది జిల్లాల్లో ఎక్కవ ఆదాయం వచ్చే జిల్లాకే నిధుల్ని ఎక్కువగా కేటాయిస్తుందా తెలంగాణ రాష్ట్ర సర్కారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చే జిల్లాలకు చెందిన ప్రజలు.. కేటీఆర్ వినిపిస్తున్న వాదననే వినిపిస్తే ఎలా ఉంటుంది? కేంద్రం దగ్గర హక్కుల కోసం పోరాడాలి. కానీ.. దేశ స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఆ వాదన ఉండకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.