Begin typing your search above and press return to search.

‘‘అల్లాహు అక్బర్’’ మాటతో విమానంలోని వారు వణికిపోయారు

By:  Tupaki Desk   |   5 July 2016 5:09 AM GMT
‘‘అల్లాహు అక్బర్’’ మాటతో విమానంలోని వారు వణికిపోయారు
X
పాతికేళ్ల కిందట ‘‘అల్లహు అక్బర్’’ అంటూ బిగ్గరగా నినదిస్తే.. భక్తిపారవశ్యంలో చేస్తున్న నినాదంగా అందరికి అనిపించేది. ఎవరికి ఎలాంటి అనుమానం.. సందేహం వచ్చేది కాదు. కానీ.. కాలక్రమంలో ఉగ్రవాదం తీవ్రరూపం దాల్చటం.. ఈ ఉగ్రవాదంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా దాడులు.. ఆత్మాహుతి దాడులకు పాల్పడే సందర్భంగా ఉగ్రవాదుల్లో అత్యధికులు‘‘అల్లాహు అక్బర్’’ అంటూ పెద్ద ఎత్తున నినాదం చేయటంతో ఇప్పుడా పదాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి విమానంలో చోటు చేసుకుంది.

దుబాయ్ నుంచి బర్మింగ్ హోమ్ కి వెళుతున్న ఎమిరేట్స్ కు చెందిన బోయింగ్ 777 విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఒకరు ఉన్నట్లుండి బిగ్గరగా ‘‘అల్లాహు అక్బర్’’ అంటూ నినదించారు. ఫిబ్రవరి 1న చోటు చేసుకున్న ఈ ఘటనలో సమయంలో విమానంలో 347 మంది ఉన్నారు. ఉన్నట్లుండి వచ్చిన ఈ నినాదంతో అందరూ వణికిపోయారు. తమకు నూకలు చెల్లిపోయినట్లుగా భావించినోళ్లు ఉన్నారు. అప్పటికప్పుడు ఏదో ఒక దాడి జరగబోతుందన్న భయాందోళనలకు గురైనోళ్లూ ఉన్నారు. ప్రయాణికులు మొదలుకొని.. విమానసిబ్బంది వరకూ అందరిలోనూ ఆందోళనే.కొందరైతే తమ జీవితాలు పూర్తి అయినట్లుగా ఫీలై ఏడ్చేశారు కూడా.

అప్పటికప్పుడు ఏదైనా చేద్దామంటే విమానంలో గాల్లో ఉంది. ఇలాంటి వేళ.. అలాంటి నినాదం సర్వార్ అనే ప్రయాణికుడి నోటి నుంచి రావటంతో అందరూ ఉలిక్కిపడి.. నోటి వెంట మాట రానట్లు షాక్ కు గురయ్యారు. తీవ్రభయాందోళనలతో వణికారు. అనంతరం కాసేపు కామ్ గా ఉన్న సదరు ప్రయాణికుడు సీటు బెల్ట్ పెట్టుకోవటానికి నిరాకరించటంతోపాటు.. ఆహారపదార్థాల్ని విసిరికొట్టటం లాంటి వింత చేష్టలకు పాల్పడ్డాడు. అయినా.. ఎవరూ ఏమిటి? అని అడిగే సాహసనం చేయలేదు. ఊపిరి బిగపెట్టి కూర్చున్నట్లుగా ఉండిపోయారు. ఇలా టెన్షన్ మధ్య సాగిన ప్రయాణంలో ఆఖరి పంచ్ గా.. బర్మింగ్ హోం ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న వేళ..‘‘భూం’’ అంటూ పెద్ద ఎత్తున అరవటంతో మరోసారి ఉలిక్కిపడ్డారు. చివరకూ ఎలాంటి ఉపద్రవం లేకుండా విమానం ల్యాండ్ కావటంతో బతుకుజీవుడా అంటూ ప్రయాణికులు బయటపడ్డారు. సర్వార్ వింత ప్రవర్తనపై విమానసిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టుకు హాజరు పర్చగా.. అతడు చేసిన తప్పును నిర్దారిస్తూ.. సర్వార్ ను దోషిగా తేలుస్తూ పది వారాలు జైలుశిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ప్రపంచ ప్రజలు ఎంతటి భయాందోళనల మధ్య బతుకుతున్నారో చెప్పటానికి ఈ ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు.