Begin typing your search above and press return to search.

రిజర్వేషన్ల మీద నవీన్ తండ్రి సంచలన కామెంట్స్...?

By:  Tupaki Desk   |   2 March 2022 10:13 AM GMT
రిజర్వేషన్ల మీద నవీన్ తండ్రి సంచలన  కామెంట్స్...?
X
ఉక్రెయిన్ లో రష్యా బాంబు దాడిలో ప్రాణాలను కోల్పోయిన నవీన్ అనే యువకుడి విషాదం గురించి తెలుసుకుని భారత్ మొత్తం కలత చెందుతోంది. దేశం కానీ దేశంలో, వేళ కాని వేళలో భీకర సమర ప్ర‌ళయ ఘోషకు బలి అయ్యాడు కర్నాటకు చెందిన నవీన్. ఇక ఉక్రెయిన్ లో నవీన్ ఎంబీబీఎస్ నాలుగవ విద్యా సంవత్సరం చదువుతున్నాడు. చెట్టంత కొడుకు డాక్టర్ అయి తిరిగి వస్తాడు అనుకుంటే శవాన్ని కూడా చూసే భాగ్యం ఉందే లేదో అన్న పుట్టెడు బాధ తల్లిదండ్రులది. ఇదిలా ఉండగా నవీన్ దేశం విడిచి ఎక్కడో ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసించడానికి కారణాలు రిజర్వేషన్ల ఫలితంగా సీటు దక్కకపోవడమే అని తండ్రి శేఖరప్ప అంటున్నారు.

తన కుమారుడు ప్రతిభావంతుడని, పీయూసీలో ఏకంగా 97 శాతం మార్కులు సాధించినా కూడా భారత దేశంలో వైద్య విద్యకు సీటు ఇవ్వలేని పరిస్థితి ఉందని విద్యా విధానంలోని లోపాలను ఎత్తి చూపుతూ కన్నీరు మున్నీరు అయ్యారు శేఖరప్ప. తమ కుమారుడికి మెరిట్ ఉన్నా సీటు రాలేదు, అదే టైమ్ లో రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తున్నారు. ఈ విధానం వల్ల భారత్ లో ఎంబీఎస్ విద్య చదవాలీ అంటే కోట్ల రూపాయలు డొనేషన్లు కట్టాల్సిందే అని ఆయన వాపోయారు.

దాంతో తన కుమారుడే కాదు, చాలామంది తెలివైన విద్యార్ధులు ఇలా విదేశాలు పడుతున్నారని ఆయన అన్నారు. దేశంలో విద్యా విధానంలో లోపాలను సరిచేసి మెరిట్ ఉన్న వారికి సీట్లు ఇస్తే ఈ రోజు తన కుమారుడు బలి కారు కదా అని కంటతడి పెట్టారు, ఇక దేశంలో కోట్ల రూపాయలు డొనేషన్లు దండుకుంటున్న విధానాన్ని కూడా ఆయన ఎత్తి చూపుతూ దాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.

నిజానికి ఉక్రెయిన్ లో ఎంతో మంది భారత విద్యార్ధినులు ఎంబీబీస్ చదువుకు వెళ్లి చిక్కుకుపోయారు. ఇక్కడ డాక్టర్ కోర్సు కోట్ల రూపాయలు అవుతుంది, అదే ఉక్రెయిన్ లో పాతిక లక్షలతో పూర్తి అవుతుంది. దాంతో కలసి వస్తుందని, మధ్యతరగతి పిల్లలే ఎక్కువగా అక్కడకి వెళ్తున్నారు. వారు విలాసాలకు వెళ్లడం లేదు, తమ భవిష్యత్తు విలాసం వెతుక్కుంటూ పోతున్నారు.

మరి అలా ఎక్కడో వెళ్లి ఎంబీబీస్ చదువుకుంటున్నారు అంటే ఈ దేశంలో వైద్య విద్య విషయంలో తీసుకురావాల్సిన సంస్క‌రణల గురించి కూడా ఈ సందర్భంగా ఆలోచించాలి. అదే విధంగా భారత్ లో డాక్టర్ గా తయారు కావాలీ అంటే కోట్లు పోయాల్సిందే అన్న మాట తలచుకుంటేనే భయం వేస్తోంది. మరి ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాల్లో వైద్య విద్య ఎందుకు చవకగా లభిస్తోంది అన్నది కూడా పాలకులు ఆలోచన చేయాలి.

అలాగే మేధావులు చెబుతున్నట్లుగా ప్రొఫేషనల్ కోర్సుల విషయంలో రిజర్వేషన్లు ఎంతవరకు ఉండాలి అన్న దాని మీద కూడా చర్చ జరపాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మొత్తానికి నవీన్ రష్యా బాంబుకు బలి అయ్యాడు అన్నది బయటకు కనిపించే వాస్తవం. ఆయన దేశాలు పట్టిపోవడం మాత్రం ఈ విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే కఠిన వాస్తవం.