Begin typing your search above and press return to search.

ఇష్టం ఉన్నంత విద్యుత్ వాడుకోండి అని ఆ దేశ ప్రధాని విజ్ఞప్తి.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   18 Nov 2021 6:36 AM GMT
ఇష్టం ఉన్నంత విద్యుత్ వాడుకోండి అని ఆ దేశ ప్రధాని విజ్ఞప్తి.. ఎందుకంటే?
X
సహజంగా విద్యుత్ వాడకంపై ఓ కుటుంబంలోని సభ్యులకు ఎంత పొదుపో... దేశ పాలకులు కూడా అంతే పొదుపుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు కొంచెం మారింది కానీ ఒకప్పుడు కరెంట్ కోతలు యమ ఉండేవి. విద్యుత్ వాడకాన్ని తగ్గించాలనే ఏకంగా ప్రభుత్వాలే ప్రకటించేవి.

అయితే ఓ దేశంలో మాత్రం ఇష్టం ఉన్నంత విద్యుత్ వాడాలని ఏకంగా ప్రధాని ప్రకటించారు. వీలైనంత ఎక్కువగా కరెంట్ ను ఉపయోగించాలని ఆ దేశ ప్రజలను కోరారు. ఇంతకీ ఆ దేశం ఏంటంటే... భారత దేశం పొరుగున ఉన్న నేపాల్. ఇష్టానుసారంగా విద్యుత్ ఉపయోగించాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబా ప్రకటించారు. నేపాల్ ఇండిపెండెంట్ పవర్ జనరేషన్ అసోసియేషన్ వార్షిక సమాశాలను ఉద్దేశించి ఆయన మాట్లాారు.

నేపాల్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యకలాపాలను వేగంవంతం చేయడానికి విద్యుత్ వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా COP-26హామీలను నెరవేర్చడానికి కూడా కరెంట్ వినియోగం పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు.

నేపాల్ మిగులు విద్యుత్ ను భారత్ కొనే నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు. అందుకే దేశంలో కరెంట్ వినియోగం పెంచాలని అభిప్రాయపడ్డారు. విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రికల్ స్టవ్ వంటి వాటిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. దేశీయంగా విద్యుత్ ను సాధ్యమైనంత వరకు వినియోగించాలని ఆయన ప్రజలను కోరారు. ఇక సాధ్యమైనంత వరకు సంప్రదాయ వనరుల ద్వారా వచ్చే విద్యుత్ ను తగ్గించాలని అన్నారు. జల వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్ ను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇకపోతే శిలాజ ఇంధనాల వాడకాన్ని కూడా దేశీయంగా తగ్గించాలని నేపాల్ ప్రధాని అక్కడి ప్రజలకు చెప్పారు. వాటి ద్వారా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యుత్ వాహనాలను ఉపయోగించాలని సూచించారు. ఇక గ్యాస్ హీటర్లను తగ్గించాలని కూడా ఈ సమావేశాలలో ఆయన వ్యాఖ్యానించారు. వాతావరణంలో జరిగే వివిధ మార్పులను తగ్గించేందుకు దక్షిణాసియాలో నేపాల్ ప్రత్యేక పాత్ర పోషించాలని ఆయన నొక్కి చెప్పారు.

అందుకే నేపాల్ లో సాధ్యమైనంత వరకు కరెంట్ వినియోగం పెంచాలని ఆ దేశ ప్రజలకు సూచించారు. అయితే తొలుత నేపాల్ లో మిగిలి ఉన్న విద్యుత్ ను భారత్ కొనుగోలు చేస్తుందని కొన్ని నివేదికలు వచ్చాయి. అందుకు నేపాల్ ముమ్మర ప్రయత్నాలు చేయగా... భారత్ అంగీకరించిందని వార్తలు ప్రచారం అయ్యాయి.

భారత్ లో నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తన మిగులు విద్యుత్ ను భారత్ లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తుందని ప్రచారం జరిగింది. తొలిదశలో దాదాపు 39 మెగావాట్ల విద్యుత్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ కొనుగోలు చేస్తుందని అనుకున్నారు. ఇందులో త్రిశూలి జల విద్యుత్ నుంచి 24 మెగావాట్లు, దేవీఘాట్ నుంచి 15 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా నేపాల్ మాత్రం మిగులు విద్యుత్ ను ఖర్చు చేయడానికి ఆ దేశ ప్రభుత్వం అంగీకరించింది. వీలైనంత ఎక్కువగా విద్యుత్ వాడకాన్ని పెంచాలని ప్రకటించారు.