Begin typing your search above and press return to search.

అయోధ్య‌లో రామాల‌యానికి అడుగు ప‌డింది!

By:  Tupaki Desk   |   9 Aug 2017 5:51 AM GMT
అయోధ్య‌లో రామాల‌యానికి అడుగు ప‌డింది!
X
ఏళ్ల‌కు ఏళ్లుగా న‌లుగుతున్న అయోధ్య‌లోని వివాదాస్ప‌ద స్థ‌లానికి సంబంధించి స‌ల‌హా.. సూచ‌న చేయ‌టం అంత తేలికైన విష‌యం కాదు. కానీ.. తొలిసారి ఈ అంశానికి సంబందించి ఒక సూచ‌న‌ను చేయ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దేశ అత్యున్న‌త కోర్టు అయిన సుప్రీంకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ షియా సెంట్ర‌ల్ వ‌క్ఫ్ బోర్డు చేసిన తాజా సూచ‌న ఎందుకు సంచ‌ల‌నంగా మారిందంటే.. అందులో పేర్కొన్న అంశాల‌నే చెప్పాలి. పీట‌ముడి ప‌డి.. ఎంత‌కూ తెగ‌ని పంచాయితీగా మారిన వేళ‌లో.. వివిధ హిందూ మ‌త సంస్థ‌లు చేస్తున్న డిమాండ్‌ కు మ‌ద్ద‌తుగా ముందుకు వ‌చ్చిన తొలి ముస్లిం సంస్థ షియా వ‌క్ఫ్ బోర్డు కావ‌టం మ‌రో కీల‌క ప‌రిణామంగా చెప్పాలి.

అయోధ్య‌లో వివాదాస్ప‌ద స్థ‌లానికి స‌ముచిత దూరంలో.. ముస్లింలు అధికంగా నివ‌సించే ప్రాంతంలో మ‌సీదును నిర‌భ్యంత‌రంగా నిర్మించుకోవ‌చ్చంటూ త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేసింది యూపీ షియా వ‌క్ఫ్ బోర్డు. అక్క‌డితో ఆగ‌ని బోర్డు.. బాబ్రీ మ‌సీదు స్థ‌లం త‌మ సొంత ఆస్తి అని.. ఈ వివాదానికి సామ‌ర‌స్య‌పూర్వ‌క ప‌రిష్కారానికి చ‌ర్చ‌లు జ‌రిపే హ‌క్కు త‌మ‌కు మాత్ర‌మే ఉంద‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానానికి స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు యూపీ షియా సెంట్ర‌ల్ వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్ స‌యిద్ వ‌సీం రిజ్వి త‌ర‌ఫున సుప్రీం కోర్టులో 30 అధ్యాయాలున్న అఫిడ‌విట్ దాఖ‌లైంది. మందిరం.. మ‌సీదు రెండు ద‌గ్గ‌ర‌గా ఉండ‌కుండా చూడాల‌ని.. ఉభ‌యూలు వాడే లౌడ్ స్పీక‌ర్ల కార‌ణంగా మ‌త‌ప‌ర‌మైన విధివిధానాల విష‌యంలో అంత‌రాయం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని.. అదే జ‌రిగితే రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగే ప‌రిస్థితులు ఉన్న‌ట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్ని నివారించేందుకు వీలుగా శ్రీరాముడి జ‌న్మ‌స్థ‌లంగా ఎంతో ప‌విత్రంగా భావిస్తున్న చోటికి సాధ్య‌మైనంత దూరంలో ముస్లిం ప్ర‌జ‌లు అధికంగా ఉన్న ప్రాంతంలో మ‌సీదు నిర్మించుకోవ‌చ్చ‌న్న అభిప్రాయాన్ని వ‌క్ఫ్ బోర్డు పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

అయోధ్య‌లోని వివాదాస్ప‌ద క‌ట్ట‌డంగా ఉన్న ప్రాంతానికి సంబంధించిన మొత్తం త‌మ ఆస్తి మాత్ర‌మే కాబ‌ట్టి.. సంబంధితుల‌తో క‌లిసి స‌మ‌స్య‌ను శాంతియుత ప‌రిష్కారానికి వ‌చ్చే హ‌క్కు త‌మ‌కే ఉంద‌ని చెప్ప‌టం ద్వారా.. అయోధ్య ఎపిసోడ్ మొత్తాన్ని ఒక కొలిక్కి తెచ్చే విష‌యంలో యూపీ షియా సెంట్ర‌ల్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పొచ్చు. మ‌రి.. దీనిపై ఇత‌ర ముస్లిం వ‌ర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. షియా బోర్డు దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ తో కొత్త ప్ర‌శ్న ఏమిటంటే.. వివాదాస్ప‌ద స్థ‌లం మొత్తం త‌మ ఆస్తిగా పేర్కొన్న వేళ‌.. ఆ యాజ‌మాన్య హ‌క్కుల్ని మ‌రెవ‌రైనా స‌వాలు చేస్తే.. అదో స‌వాలుగా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంది. ఏమైనా.. అయోద్య వివాదాస్ప‌ద స్థ‌లంలో రామాల‌య నిర్మాణానికి యూపీ సెంట్ర‌ల్ షియా బోర్డు తాజా అపిడ‌విట్ మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్లుఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.