Begin typing your search above and press return to search.

అఖిల ఓట్లెప్పుడ‌గాలో....శిల్పా చెప్పేశారు!

By:  Tupaki Desk   |   15 Aug 2017 4:15 PM GMT
అఖిల ఓట్లెప్పుడ‌గాలో....శిల్పా చెప్పేశారు!
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో రోజుకో కొత్త ఘ‌ట‌న చోటుచేసుకుంటోంది. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైనల్స్‌ గా ప‌రిగ‌ణిస్తున్న ఈ ఎన్నిక‌లో గెలిచి తీరాల్సిందేన‌ని అటు అధికార పార్టీ టీడీపీతో పాటు ఇటు విప‌క్షం వైసీపీ కూడా త‌మ త‌మ స‌ర్వ‌శ‌క్తుల‌న్నీ ఒడ్డుతున్నాయి. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల నామినేష‌న్లు పూర్తి కాగా... ఇక పోలింగ్ ప్ర‌క్రియ ఒక్క‌టే మిగిలి ఉంది. ఈ క్ర‌మంలో ఇరు పార్టీల నేత‌లు అక్క‌డ ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల అక్క‌డ తొలి సారి అడుగుపెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నంద్యాల‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భా వేదిక‌గా అధికార టీడీపీకి గ‌ట్టి స‌వాలే విసిరారు. ద‌మ్ముంటే త‌న పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించి - టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. అంతేకాకుండా... టీడీపీ నుంచి త‌న పార్టీలోకి చేరిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి చేత బ‌హిరంగ స‌భా వేదిక మీదే ప్ర‌జ‌ల స‌మ‌క్షంలోనే రాజీనామా చేయించేశారు.

ఈ దెబ్బ‌కు ఒక్క‌సారిగా టీడీపీ నోట మాట రాలేదు. ఇప్పుడు శిల్పా చేసిన రాజీనామాకు ఆమోద ముద్ర ప‌డిపోయింది. తాము నీతివంతమైన రాజ‌కీయాలే చేస్తామ‌ని చెప్పిన వైఎస్ జ‌గ‌న్‌ - శిల్పా బ్ర‌ద‌ర్స్‌... విశ్వ‌స‌నీయ‌త కంటే కూడా త‌మ‌కు ప‌ద‌వులేమీ పెద్ద కాద‌ని కూడా ఈ ఒక్క చ‌ర్య‌తోనే తేల్చి చెప్పేశారు. ఇప్పుడు నంద్యాల‌లో ఎక్క‌డికి వెళ్లినా... మంత్రి భూమా అఖిల‌ప్రియ‌ను జ‌నం ఇదే మాట అడుగుతున్నార‌న్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ ప‌ద‌వికి శిల్పా రాజీనామా చేశారు... వైసీపీ ఇచ్చిన ప‌ద‌వికి మీరెప్పుడు రాజీనామా చేస్తారంటూ జ‌నం అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు అఖిల స‌మాధానాన్ని దాట‌వేస్తూనే ముందుకు సాగుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో త‌న రాజీనామాకు ఆమోదం ల‌భించిన త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి... అఖిల‌కు సూటిగా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.

వైసీపీలో చేరుతున్నందుకు టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నానని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువల కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన రాజీనామా కోరారని వెల్లడించారు. విలువలకు తమ కుటుంబం కట్టుబడి వుంటుందని, తన రాజీనామాతో ఈ విషయం నిరూపితమైందని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ ముందు రాజీనామా చేసి తర్వాత ఓట్లు అడిగితే గౌరవంగా ఉంటుందని అన్నారు. నైతిక విలువలు ఎవరికున్నాయో తన రాజీనామాతో తేలిందని చక్రపాణిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారానికి రాజీనామాతో సరైన సమాధానం చెప్పామన్నారు. తన రాజీనామాతో వైఎస్సార్‌ సీపీ నాయకుల విలువ మరింత పెరిగిందని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆమోదింపజేసుకోవాలని ఆయ‌న‌ మరోసారి డిమాండ్‌ చేశారు.