Begin typing your search above and press return to search.

కొత్త ఫజిల్: శిల్పా చౌదరి చెప్పిన కొత్త పేరు.. ఆమె ఎవరు?

By:  Tupaki Desk   |   5 Dec 2021 4:30 AM GMT
కొత్త ఫజిల్: శిల్పా చౌదరి చెప్పిన కొత్త పేరు.. ఆమె ఎవరు?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన శిల్పా చౌదరి ఎపిసోడ్ తెలిసిందే. సెలబ్రిటీలు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలు.. వారి కుటుంబాల్లోని మహిళలతో తరచూ పార్టీలు నిర్వహిస్తూ.. తియ్యటి మాటలతో సరికొత్త వ్యాపారానికి పెట్టుబడులు అవసరమంటూ భారీ మొత్తాల్ని సింఫుల్ గా లాగేసిన ఆమె వైనం సంచలనంగా మారటం తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు.. పలువురు చెబుతున్న మాటల ప్రకారం.. పలువురు నుంచి ఆమె సేకరించిన నిధులు దాదాపు రూ.100 - రూ.200 కోట్ల మధ్య వరకు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

ఒక ప్రముఖ టాలీవుడ్ హీరో కుటుంబానికి చెందిన వారే దాదాపు రూ.15 కోట్ల వరకు శిల్పా చౌదరికి ఇచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకున్న పోలీసులు గడిచిన రెండు రోజులుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు తనకే పాపం తెలీదంటూ.. తన ఆరోగ్యం బాగోలేదని చెబుతూ.. అదే పనిగా కన్నీళ్లు పెట్టుకున్న శిల్పా చౌదరి.. పోలీసుల సహనానికి పరీక్ష పెట్టటం తెలిసిందే.

గంటల కొద్దీ విచారణ సాగినా.. ఆమె నోటి నుంచి వచ్చిన వివరాలు మాత్రం చాలా తక్కువనే చెబుతున్నారు. ఇదిలా ఉండగా రెండో రోజు విచారణలో.. శిల్పా చౌదరి నోటి నుంచి కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. తాను ఎవరిని మోసం చేయాలన్న ఉద్దేశంతో డబ్బులు తీసుకోలేదని చెప్పిన ఆమె.. తాను తీసుకున్న డబ్బుల్ని తాను వేరే వారికి ఇచ్చానని.. వారి నుంచి తిరిగి రాకపోవటంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ‘రాధిక’ కొత్త క్యారెక్టర్ ను ఆమె తెర మీదకు తీసుకొచ్చారు.

సదరు రాధికకు తాను పెద్ద ఎత్తున డబ్బును ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ రాధిక ఎవరు? ఆమెకు శిల్పా చౌదరికి మధ్య రిలేషన్ ఏమిటి? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయాలపై పోలీసులు ఫోకస్ చేయనున్నట్లుగా తెలిసింది. అదే సమయంలో.. శిల్పా చౌదరి నివాసమైన గండిపేట సిగ్నేచర్ విల్లాలోని ఆమె ఇంటికి తీసుకెళ్లి పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను పోలీసులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో కొన్నింటిలో చాలా తక్కువ మొత్తం ఉండగా.. మరికొన్నింటిలో అసలు డబ్బులే లేవని చెబుతున్నారు. కోర్టు ఇచ్చిన రెండురోజుల కస్టడీ గడువు శనివారంతో ముగియటంతో ఆమెను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి.. చంచలగూడ జైలుకు పంపారు. గడిచిన ఏడాది కాలంలో ఆమె జరిపిన ఆర్థిక లావాదేవీల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.