Begin typing your search above and press return to search.

ఆ ఆరుగురి వ‌ల్లే..ఇలా జ‌రిగింది అంటున్న శిల్పా

By:  Tupaki Desk   |   23 Aug 2017 4:41 PM GMT
ఆ ఆరుగురి వ‌ల్లే..ఇలా జ‌రిగింది అంటున్న శిల్పా
X
ప్ర‌జ‌ల పక్షాన ఉండే పార్టీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని - నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీదేన‌ని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన ఓటర్లు ధర్మం వైపు నిలబడ్డారని సంతోషం వ్య‌క్తం చేశారు. పోలింగ్‌ అనంతరం శిల్పా మోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నిక సందర్భంగా నంద్యాలలో టీడీపీ అనైతిక చర్యలకు పాల్పడిందని మండిప‌డ్డారు. త‌మ‌ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేందుకు టీడీపీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారని శిల్పా పేర్కొన్నారు. నిన్న రాత్రి నుంచి చక్రపాణిరెడ్డిని అరెస్టు చేయాలని చూశారని అయితే తాము ఒప్పుకోకపోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలని కోరామ‌ని, త‌న తమ్ముడిని తానే బయటకు రాకుండా చూశానని తెలిపారు.

తెలుగుదేశం నేతలు ప్ర‌జాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌ని శిల్పా మోహ‌న్ రెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌ రెడ్డి - బుడ్డా రాజశేఖరరెడ్డి - బీసీ జనార్ధన్‌ రెడ్డి - అఖిలప్రియ - రామకృష్ణారెడ్డి - ప్రభాకర్‌ చౌదరి తదితరులు ఎన్నికల్లో విఘాతం కలిగించేందుకు, ఇబ్బందులు సృష్టించి ఎన్నికలు వాయిదా వేయించేందుకు ప్రయత్నించారని తెలిపారు. టీడీపీ అభ్య‌ర్థి బ్రహ్మనందరెడ్డి త‌మ‌ కౌన్సిలర్‌ను బెదిరించారని తెలిపారు. భూమా మౌనికారెడ్డి త‌మ‌ ఏజెంట్‌ ను బెదిరించి బయటకు పంపించారని - మున్సిపల్‌ హైస్కూల్‌ లో కూడా ఆమె చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని శిల్పా మండిప‌డ్డారు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, అతని అనుచరులు త‌మ‌ కౌన్సిలర్‌పై దాడి చేయడం, బెదిరించడం దారుణమ‌ని అన్నారు. టీడీపీకి చెందిన వారిపట్ల కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరించార‌ని ఆయ‌న ఆరోపించారు. కొందరు పోలీసు అధికారులు - సీఆర్‌ పీఎఫ్‌ సిబ్బంది బాగా పని చేశారని... కిందిస్థాయి అధికారులు మాత్రం మమ్మల్ని కొంత ఇబ్బందిపాలు చేశారని శిల్పా తెలిపారు. చివరి నిమిషంలో గొడవలు సృష్టించడం బాధాకరమ‌ని అయితే టీడీపీ నేతలు రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామన్నారు.

మలేరియా జ్వరం వల్ల - ప్ర‌చారంలో స‌మ‌యంలో కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్ల కొంత మందిని కలువలేకపోయానని పేర్కొంటూ దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని మనవి చేస్తున్నానని శిల్పా తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి సహకరించిన నంద్యాల నియోజకవర్గ ప్రజలకు - అధికారులకు - మీడియాకు శిల్పా ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక‌ ధన్యవాదాలు తెలిపారు. త‌న తమ్ముడు చక్రపాణిరెడ్డి రాజకీయాల్లో నిజాయితీగా ఉండటానికి ఎమ్మెల్సీ పదవిని వదులుకొని రావడం గర్వకారణమ‌ని ప్ర‌శంసించారు. ఈ నైతిక విలువలు వైఎస్‌ ఆర్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాటిస్తున్నారని... ఇవే విలువలు చంద్రబాబు పాటిస్తే బాగుంటుందని ఆయ‌న అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే బాగుంటుందని శిల్పా తెలిపారు. వైఎస్‌ జగన్‌ - చంద్రబాబు మధ్య వ్యక్తిగత వైరం లేదని, కేవలం రాజకీయ వైరుధ్యమే ఉందని ఆయన చెప్పారు.