Begin typing your search above and press return to search.

జపాన్ ఎన్నికల్లో షింజో అబే పార్టీ క్లీన్ స్వీప్.. ఎన్ని సీట్లు అంటే?

By:  Tupaki Desk   |   13 July 2022 6:30 AM GMT
జపాన్ ఎన్నికల్లో షింజో అబే పార్టీ క్లీన్ స్వీప్.. ఎన్ని సీట్లు అంటే?
X
ప్రపంచంలో అతి తక్కువ నేరాలు నమోదయ్యే దేశాల జాబితాలో అత్యంత ధనిక దేశమైన జపాన్ ముందుంటుంది. అలాంటి దేశంలో మాజీ ప్రధాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వేళ.. అనూహ్యంగా హత్యకు గురి కావటం యావత్ ప్రపంచాన్ని షాకింగ్ కు గురి చేసింది. ఇక.. జపనీయుల పరిస్థితి మాత్రం నమ్మలేని రీతిలో ఉంది. ఇలాంటి ఉదంతం తమ దేశంలో జరగటాన్ని వారు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురైన రెండు రోజులకే జరిగిన ఎగువ సభ ఎన్నికల్లో.. ఆయన ప్రాతినిధ్యం వహించే అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ - కొమైటో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. తిరుగులేని మెజార్టీని సొంతం చేసుకుంటూ 76 స్థానాల్లో విజయం సాధించింది.

షింజో దారుణ హత్య నేపథ్యంలో.. ఈ దారుణ ఉదంతం జరిగిన రోజే ఆయన పార్టీకి చెందిన కీలక నేత.. జపాన్ ప్రధానమంత్రి పుమియో కిషిదాతో పాటు ఇతరులు సంతాపాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

షింజో హత్య జరిగిన రెండు రోజులకు జరిగిన ఎన్నికల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లను చదివిన ప్రధాని పుమియో కిషిదా.. తీవ్రమైన విషాదంలో ఉన్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలిచారన్న సంతోషం ఆయన ముఖంలో కనిపించలేదు. షింజో మరణం తాలుకూ షాక్ ఆయన్ను విడిచిపెట్టలేదన్న మాట వినిపిస్తోంది.

ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల ప్రక్రియ ఈసారి హింస భయపెట్టిందన్న ఆయన.. ఎన్నికల్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లే జరిగిన పోలింగ్ లో రికార్డు స్థాయిలో 52.05 శాతం జపనీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019తో పోలిస్తే ఇదే అధికమని చెప్పాలి. రెండు కోట్ల మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

తాజా విజయం నేపథ్యంలో పుమియో కిషిదా సర్కారుకు మరో మూడేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన చేసే అవకాశం లభించిందని చెప్పాలి. షింజో దారుణ హత్య.. పార్టీకి తిరుగులేని అధిక్యతకు కారణమైందన్న మాట వినిపిస్తోంది.