Begin typing your search above and press return to search.

ఆ ప‌ని చేస్తే షిర్డీలో ఏడాది పాటు వీఐపీ ద‌ర్శ‌నం!

By:  Tupaki Desk   |   22 Jun 2017 8:32 AM GMT
ఆ ప‌ని చేస్తే షిర్డీలో ఏడాది పాటు వీఐపీ ద‌ర్శ‌నం!
X
అధ్యాత్మిక కేంద్రాలు చేయాల్సింది వ్యాపారం ఎంత మాత్రం కాదు. ఆ విష‌యం షిర్డీ సంస్థాన్‌కు తెలిసినంత బాగా మ‌రే పుణ్య‌క్షేత్రంలోని పాల‌క మండ‌ళ్ల‌కు తెలీద‌ని చెప్పాలి. షిర్డీలో ప్ర‌సాదంతో పాటు.. స‌బ్సిడీ ధ‌ర‌కు ల‌భించే ఆహారంతో.. పుణ్య‌క్షేత్రానికి వెళ్లే ప్ర‌తిఒక్క‌రికి క‌డుపునిండా భోజ‌నం ల‌భించే ప‌రిస్థితి.

చాలా పుణ్య‌క్షేత్రాల్లో అన్న‌దానం అమ‌లు చేసినా.. మిగిలిన వాటిల్లో క‌నిపించే వాణిజ్య ధోర‌ణి షిర్డీ సంస్థాన్‌ లో పెద్ద‌గా క‌నిపించ‌దు. తాజాగా షిర్డీ సంస్థాన్ పాల‌క మండ‌లి తీసుకున్న నిర్ణ‌యం స‌రికొత్త‌గా ఉంద‌ని చెప్పాలి. షిర్డీకి వెళ్లి బాబా ద‌ర్శ‌నం కోసం గంట‌ల కొద్దీ స‌మ‌యం క్యూలైన్లోనే స‌రిపోతుంద‌ని ఫీల్ అవుతున్నారా? అయితే.. ఇక‌పై అలా ఫీల్ అవ్వాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎందుకంటే.. వీఐపీ ద‌ర్శ‌నం.. అది కూడా ఏడాది పాటు క‌ల్పించే అవ‌కాశాన్ని షిర్డీ సంస్థాన్ ప్ర‌క‌టించింది.

ఇందుకోసం భ‌క్తులు చేయాల్సిందేమీ లేదు. బాబా ద‌ర్శ‌నానికి వెళ్లిన వారు ర‌క్త‌దానం చేయ‌ట‌మే. అలా ర‌క్త‌దానం చేసిన వారికి షిర్డీ ఆల‌యంలో ఏడాది పాటు వీఐపీ హోదాలో ద‌ర్శ‌నం చేసుకోవ‌టంతో పాటు.. స‌త్రాల బ‌స విష‌యంలోనూ వీఐపీ త‌ర‌హాలో ఏర్పాటు చేయ‌నున్నారు.

తిరుమ‌ల‌లో త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే అల‌వాటు భ‌క్తుల్లో ఎంత‌గా ఉందో.. షిర్డీకి వచ్చే భ‌క్తులంతా ర‌క్త‌దానం చేయ‌టాన్ని ఒక ఆన‌వాయితీగా మారుస్తామ‌ని చెబుతున్నారు షిర్డీ సంస్థాన్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ సురేశ్ హారే. ర‌క్త‌దానం లాంటి సామాజిక కార్య‌క్ర‌మాన్ని ఒక ఉద్య‌మ రూపంలో తీసుకెళ్లేలా షిర్డీ సంస్థాన్ తీసుకున్న నిర్ణ‌యాన్ని.. మ‌రిన్ని అధ్యాత్మిక కేంద్రాలు ఫాలో అయితే ర‌క్త స‌మ‌స్య అన్న‌ది ఉండ‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/