Begin typing your search above and press return to search.

ముఖేష్ అంబానీని ఢీకొట్టేది ఈయ‌న ఒక్క‌డే

By:  Tupaki Desk   |   16 Oct 2019 4:18 AM GMT
ముఖేష్ అంబానీని ఢీకొట్టేది ఈయ‌న ఒక్క‌డే
X
ఎప్ప‌ట్లాగే...దేశీయ కుబేరుడు - రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్‌ అంబానీ ఇటీవ‌ల మ‌రోమారు అంద‌రి దృష్టిని మ‌రోమారు త‌న‌వైపు నిలుపుకొన్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుత సంవత్సరానికి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో వరుసగా 12వ ఏడాది 51.4 బిలియన్ డాలర్లతో ముఖేష్‌ అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు. టెలకం రంగంలో ప్రభంజనం సృష్టించిన జియోతో ఆయన సంపద మరో 4.1 బిలియన్ డాలర్లు పెరిగింది. మౌలిక సదుపాయాల టైకూన్ గౌతమ్ అదానీ ఈసారికిగాను రెండో స్థానానికి ఎగబాకారు. అయితే...వీరిద్ద‌రి స్థానాన్ని ఓ ప్ర‌ముఖుడు దాటేశాడు. అయితే, సంప‌ద‌లో కాదు...దాతృత్వంలో. ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌ సీఎల్ అధినేత శివ్ నాడర్ మాత్రం తొలిస్థానంలో నిలిచారు. 21 బిలియన్ డాలర్లతో ప్రత్యేక చారిటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విప్రో అధినేత అజీం ప్రేమ్‌ జీకి ప్రస్తుత సంవత్సరానికి గాను హ్యురున్ దేశీయ దాతల జాబితాలో రెండో స్థానం దక్కింది. దాతల జాబితాలో ముఖేస్‌ మూడో స్థానంలో ఉన్నారు.

కంపెనీల యాక్ట్ 2013 ప్రకారం సామాజిక బాధ్యతలో భాగంగా కార్పొరేట్ కుటుంబాలు, వారి సంస్థలకు వచ్చిన లాభాల్లో రెండు శాతం దాతృత్వం కింద తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుంది. వీరిలో శివ్ నాడర్ - ఆయన కుటుంబ సభ్యులు కలిసి రూ.826 కోట్లు దాతృత్వం కింద కేటాయించగా - ఇదే సమయంలో ప్రేమ్‌ జీ రూ.453 కోట్లు - ముకేశ్ అంబానీ రూ.402 కోట్లను అందించారు. దాతృత్వం కింద కేటాయించే నిధుల్లో అత్యధికంగా విద్యకోసం ఖర్చు చేస్తున్నారు. వీరిలో ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నందన్ నీలేకని - ఆయన భార్య రోహిని సంయుక్తంగా రూ.346 కోట్ల నిధులను విద్య కోసం ఖర్చు చేశారు. 2018లో దాతృత్వం కింద రూ.5 కోట్ల కంటే అధికంగా నిధులను కేటాయించినవారు 38 మంది ఉండగా - ప్రస్తుత సంవత్సరానికిగాను రెండింతలు పెరిగి 72కి చేరుకున్నారు. మొత్తంమీద దాతృత్వం కింద రూ.4,391 కోట్ల నిధులను వెచ్చించినట్లు అయింది.

ఇదిలాఉండ‌గా - ఆస్తుల విష‌యంలో గ‌త ఏడాది ఫోర్బ్స్ జాబితాలో రెండో స్థానంలో ఉన్న విప్రో అధినేత అజీం ప్రేమ్‌ జీ ఈసారి 17వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 15.6 బిలియన్ డాలర్ల సంపదతో హిందుజా బ్రదర్స్ మూడో స్థానంలో నిలువగా - పల్లోంజి మిస్త్రీ 15 బిలియన్ డాలర్ల నికర ఆస్తితో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. దేశీయంగా నెలకొన్న ఆర్థిక మందకొడి పరిస్థితుల కారణంగా గతేడాదితో పోలిస్తే శ్రీమంతుల సంపాదన 8 శాతం తగ్గి 452 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ వందమంది జాబితాలో సగం మంది నికర ఆస్తుల విలువ పడిపోవడం విశేషం.