Begin typing your search above and press return to search.

బీజేపీని అంత‌గా ద్వేషిస్తున్నావా ఉద్ద‌వ్‌?

By:  Tupaki Desk   |   24 July 2018 5:01 AM GMT
బీజేపీని అంత‌గా ద్వేషిస్తున్నావా ఉద్ద‌వ్‌?
X
బీజేపీకి చిర‌కాల మిత్రుడైన శివ‌సేన‌.. ఈ మ‌ధ్య కారాలు మిరియాలు నూర‌టం తెలిసిందే. బీజేపీలో మోడీ ప్రాధాన్య‌త పెరుగుతున్న కొద్దీ.. శివ‌సేన‌తో బీజేపీ బంధం అంత‌గా ప‌లుచ‌న అవుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా ఓటింగ్ లో పాల్గొన‌కుండా వాకౌట్ చేసిన శివ‌సేన‌.. అవిశ్వాసం త‌ర్వాత మోడీ స‌ర్కారుపై నేరుగా ఫైర్ అవుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో జ‌త క‌ట్టే అవ‌కాశ‌మే లేద‌ని తేల్చేసిన శివ‌సేన‌.. అదే విష‌యాన్ని బీజేపీవెల్ల‌డించింది. ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య వ‌ర‌కూ బీజేపీకి భారీ అండ‌గా ఉన్న శివ‌సేన‌.. ఇప్పుడు అందుకు భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. తాజాగా శివ‌సేన చీఫ్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఈ దేశంలో ఆవుల‌కు ర‌క్ష‌ణ ఉంది కానీ.. మ‌హిళ‌ల‌కు లేద‌న్న ఆయ‌న దేశంలో మ‌హిళ‌ల‌కు పూర్తిగా భ‌ద్ర‌త క‌రువైందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

మ‌హిళ‌ల్ని కాపాడాల్సింది పోయి ఆవుల్ని కాపాడుతున్నార‌న్న ఆయ‌న‌.. ప్ర‌పంచంలోనే మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త లేని దేశంగా ఇండియా మారింద‌ని విరుచుకుప‌డ్డారు. ప్ర‌భుత్వంలో తాము భాగ‌స్వాముల‌మే కానీ.. త‌ప్పు జ‌రుగుతుంటే ఊరుకునేది లేద‌న్నారు. త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా తాము గ‌ళాన్ని విప్పుతామ‌ని చెప్పారు. తాము భార‌తీయ జ‌నతాకు మిత్రుల‌మే కానీ.. భార‌తీయ జ‌న‌తా పార్టీకి కాదంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

బీజేపీ చెప్పే హిందూత్వ అంతా బూట‌క‌మ‌న్న ఆయ‌న‌.. జాతి వ్య‌తిరేకి ఎవ‌రు? జాతీయ‌వాది ఎవ‌ర‌న్న‌ది డిసైడ్ చేయ‌టానికి బీజేపీ ఎవ‌ర‌ని వ్యాఖ్యానించారు

ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించిన వారంతా జాతి వ్య‌తిరేకులు అయిపోర‌న్న ఉద్ద‌వ్‌.. త‌ప్ప‌ట‌డుగులు వేస్తే ప్ర‌భుత్వాన్నివిమ‌ర్శిస్తామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం మెప్పు కోసం తాము ప్ర‌య‌త్నించ‌మ‌న్న వారు.. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తాము ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని చెప్పారు. తాము సామాన్యుడి క‌ల‌ను నెర‌వేర్చ‌టానికి పోరాడుతున్నామే త‌ప్పించి.. మోడీక‌ల‌ను నెర‌వేర్చేందుకు కాదంటూ వ్యాఖ్యానించారు.