Begin typing your search above and press return to search.

మోడీకి స్వచ్ భారత్ పంచ్

By:  Tupaki Desk   |   8 April 2015 5:02 AM GMT
మోడీకి స్వచ్ భారత్ పంచ్
X
స్వచ్చ భారత్ మంచి కార్యక్రమమే అయినా... అదే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నట్లు వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అదే కార్యక్రమాన్ని బేస్ చేసుకొని పంచ్ పడింది. అది కూడా నిన్నా మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న శివసేన నుంచి. పొగాకు వాడకాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా గగ్గోలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉండి ఆ తర్వా దూరమైన శివసేన ఘాటుగా స్పందించింది.

మోడీ రోడ్లు ఊడ్చడం సరే.. ఎంపీల నోటిని శుభ్రపరిచేదెవరు? అంటూ తమ అధికార పత్రిక సామ్నాలో శివసేన ప్రశ్నించింది. ఎంపీలు, ఇతరుల వ్యాఖ్యల విషయంలో బీజేపీ మౌనంగా ఉండటాన్ని తప్పుబడుతూ, రోడ్లను శుభ్రపరిచేందుకు ప్రధాని మోదీ చీపురు చేతబట్టడం బాగానే ఉందిగానీ, ఆ ఎంపీల నోటికంపును శుభ్రపరిచేదెవరు? అని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. పొగాకు కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు లేవన్న గొప్ప విషయాన్ని కనుగొన్నందుకు ఎంపీ దిలీప్‌గాంధీకి నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేసింది. ఈ విషయాన్ని ఆయన ఎప్పుడు కనుగొన్నారనేది మాత్రం ఎవరూ అడగవద్దని పేర్కొంది. దిలీప్ వ్యాఖ్యలను పొగాకు పరిశ్రమ స్వాగతించి ఉండవచ్చేమోగానీ దానివల్ల నష్టపోయిన ఎన్నో కుటుంబాలు ఆయనపై శాపనార్థాలు పెడతాయని హెచ్చరించింది. ముంబైలోని టాటా ఆస్పత్రిలో ప్రతి వంద మంది రోగుల్లో 60-65 మంది పొగాకు ఉత్పత్తుల కారణంగా బాధపడుతున్నవారేనని శివసేన పేర్కొంది.

అయితే ఈ విషయమే కేంద్రం ఇన్్ డైరెక్టుగా రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్యసేవల డైరెక్టర్ జనరల్ జగదీశ్‌ప్రసాద్ మాట్లాడుతూ.. పొగాకు కారణంగా క్యాన్సర్ రావడమనేది వందశాతం జరుగుతుందని, ఇందులో ఎటువంటి అనుమానమూ అవసరంలేదని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బీపీ శర్మ మాట్లాడుతూ... పొగాకు ఉత్పత్తుల డబ్బాలపై హెచ్చరిక బొమ్మల సైజును పెంచాలన్న నిర్ణయానికి ప్రభుత్వం తరఫున తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. హెచ్చరిక బొమ్మ సైజును 40 శాతం నుంచి 85 శాతానికి పెంపు అమలు వాయిదా మాత్రమే పడిందని, దీన్ని రద్దు చేస్తామని ఎవరూ చెప్పలేదు అని అన్నారు.

అయితే.. కేంద్రం నేరుగా రంగంలోకి సొంత పార్టీ వారిని అదుపులో పెట్టుకోకుంటే నష్టం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు చెప్తే ప్రస్తుత పరిస్థితుల్లో నాయకులు అదికూడా...అధికార పార్టీ నాయకులు వింటారా?