Begin typing your search above and press return to search.

పాత మిత్రుడి పై 'షా' చరకలు.. భారీ పంచ్ తప్పదా?

By:  Tupaki Desk   |   20 Dec 2021 4:05 AM GMT
పాత మిత్రుడి పై షా చరకలు.. భారీ పంచ్ తప్పదా?
X
దశాబ్దాల తరబడి బీజేపీకి అత్యంత నమ్మకస్తుడైన మిత్రుడిగా నిలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది శివసేననే. రెండంటే రెండు సీట్లతో బీజేపీ ఉన్న కష్ట కాలంలోనే కమలనాథులకు అండగా నిలిచిన రాజకీయ పార్టీగా శివసేనను చెప్పాలి. అలాంటి మిత్రుడ్ని సైతం బీజేపీ వదులుకుందంటే.. అందుకు మోడీషాలే కారణంగా చెప్పాలి. ఎప్పుడైతే బీజేపీ అద్వానీ లాంటి పెద్దల చేతి నుంచి మోడీ లాంటి వారిచేతుల్లోకి వచ్చిందో.. రాజకీయ లెక్కలన్ని మారిపోయాయి. అధికారం తమ చేతుల్లోనే ఉండాలన్న మొండితనం మోడీకి ఎంత ఎక్కువో తెలిసిందే. అదే.. బీజేపీ- శివసేన మధ్య మిత్ర బంధాన్ని బీటలు వారేలా చేసిందని చెప్పాలి.

ఏ చిన్న అవకాశం వచ్చినా.. సేనపై ఆగ్రహం వ్యక్తం చేయటం.. తీవ్ర వ్యాఖ్యలు చేయటం షా అండ్ కోకు అలవాటుగా చెబుతారు. తనపై చేసే విమర్శలకు అంతే ఘాటుగా రియాక్టు కావటంతో శివసేన ఎప్పుడు తగ్గలేదు. మహారాష్ట్రలో బీజేపీ సర్కారు అధికారంలోకి రాకుండా ఉండేందుకు శివసేన చేసిన తీరుపై విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా లభించాయి. మిత్రధర్మాన్ని పాటించనందుకే ఇలాంటి పరిస్థితి అని చెబుతారు.

శివసనే.. కాంగ్రెస్.. ఎన్సీపీ లాంటి మూడు దిక్కులుగా ఉండే రాజకీయ పార్టీలు ఒక వేదికను ఏర్పాటు చేసుకోవటమేకాదు.. ప్రభుత్వాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న వైనం బీజేపీకి ఎంతమాత్రం నచ్చటం లేదనే చెప్పాలి. అందుకే.. అఘాడీ సర్కారుపై ఏ మాత్రం అవకాశం లభించినా.. ఏదో ఒక మాట అనేస్తుంటారు కమలనాథులు. తాజాగా కేంద్ర హోం మంత్రిగా వ్యవహరిస్తున్న అమిత్ షా మాట్లాడుతూ.. అఘాడీ సర్కారుపై కాసింత వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

అఘాడీ సర్కారును మూడు టైర్ల ఆటో రిక్షాగా పోల్చారు. మూడు టైర్లూ.. మూడు దిశల్లో ఉన్నాయని.. అన్ని టైర్లకు పంక్చర్ అయ్యిందని.. అందుకే దగ్గర ఉన్నా కలవటం లేదంటూ ఎద్దేవా చేశారు. పంక్చర్ అయిన ఆటో ముందుకు కదలకుండా పొగ మాత్రమే వదులుతూ కాలుష్యాన్ని వెదజల్లుతోందన్నారు. ఫూణేలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ పంచ్ లకు పాత మిత్రుడైన శివసేన నుంచి ఘాటు రియాక్షన్ తప్పదని.. వారి నుంచి వచ్చే పంచ్ లు మరింత డ్యామేజింగ్ గా ఉంటాయని చెబుతున్నారు. కదిలించుకొని మరీ తిట్టించుకోవటంలో అమిత్ షాకు అంత ఆసక్తి ఏమిటో?