Begin typing your search above and press return to search.

ఆయన ముఖానికి నల్లరంగు పూసేశారు

By:  Tupaki Desk   |   13 Oct 2015 4:44 AM GMT
ఆయన ముఖానికి నల్లరంగు పూసేశారు
X
అసహనం హద్దులు దాటింది. తమకు నచ్చని పనిని చేస్తున్నారన్న అగ్రహంతో భౌతికంగా దాడికి పాల్పడేలా.. ముఖానికి నల్లటి రంగును పూసేసి అవమానించటమే కాదు.. తాము చెప్పినట్లు వినకపోతే ఇలాంటి చర్యలు తప్పవన్నట్లుగా శివసేన కార్యకర్తలు చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

పాకిస్తాన్ మాజీ విధేశాంగ మంత్రి ఖుర్షీద్ మొహమ్మద్ కసూరి.. ‘‘నైదర్ ఎ హాక్.. నార్ ఏ డవ్.. యాన్ ఇన్ సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్తాన్ ఫారిన్ పాలసీ’’ అన్న పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. దాని ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముంబయిలో చేపట్టారు. అయితే.. ముంబయి నగరానికి పాక్ ప్రముఖుల కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదంటూ శివసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి తగ్గట్లే తాజా పుస్తకావిష్కరణ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీన్ని పట్టించుకోకుండా అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో బీజేపీ ఒకనాటి సిద్ధాంతకర్త సుదీంద్ర కులకర్ణి పుస్తకావిష్కరణను చేపట్టాలని భావించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం పుస్తకావిష్కరణ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన్ను అడ్డుకున్న శివసేన కార్యకర్తలు ఆయన ముఖానికి నల్లరంగు పూసేశారు. బూతులు తిట్టేశారు. తీవ్రంగా అవమానించే ప్రయత్నం చేశారు.

ఇంత జరిగిన తర్వాత కూడా పుస్తకావిష్కరణ సభకు వెళ్లాలన్న పట్టుదలతో సుదీంద్ర.. ముఖానికి ఉన్న నల్లరంగుతోనే ఆయన కార్యక్రమానికి హాజరయ్యారు. ఏదైనా విషయం మీద శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం ఉన్నా.. అందుకు భిన్నంగా దురుసుగా.. దుందుడుకుగా.. తాము కోరుకున్నట్లే జరగాలన్న శివసేన కార్యకర్తల వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సుదీంద్ర కులకర్ణిపై జరిగిన దాడిపై రాజకీయ వర్గాలు.. బాలీవుడ్.. సెల్రబిటీలతో సహా అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమైంది. అయితే.. తాము చేసిన చర్యపై శివసేన సమర్థించుకుంది. సుదీంద్ర ముఖానికి ఇంకు పూయటాన్ని చూసి చాలామంది బాధపడుతున్నారని.. కానీ.. సరిహద్దుల్లో మన సైనికుల్ని చంపి వారి రక్తాన్ని చిందించిన విషయాల్ని గుర్తుచేసుకోవాలని వారు వాదిస్తున్నారు. తాము పూసింది ఇంకు కాదని.. మన సైనికుల రక్తమని వ్యాఖ్యానించారు.

సుదీంద్రపై జరిగిన దాడిని బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అద్వానీ కూడా తీవ్రంగా ఖండించారు. ఎవరైనా సరే.. తమకు అనుకూలంగా లేకుంటే.. వారిపై హింసకు దిగుతున్నారని.. ఇలాంటి వైఖరి మంచిది కాదన్న ఆందోళనను వ్యక్తం చేశారు. అద్వానీ ఆందోళనలో అర్థం ఉందని చెప్పకతప్పదు. హద్దులు దాటే వారు ఎంతటి భావోద్వేగ మాటలు చెప్పినా వారిని వదలకూడదు. చట్టం ఎవరికి చుట్టం కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.