Begin typing your search above and press return to search.

మోడీ పతనానికి ఇది మరో ఎగ్జాంపులా?

By:  Tupaki Desk   |   8 March 2018 3:30 PM GMT
మోడీ పతనానికి ఇది మరో ఎగ్జాంపులా?
X
2014 సార్వత్రిక ఎన్నికల్లో అప్రతిహతమైన మెజారిటీ సాధించి.. సింగిల్ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన మెజారిటీ దక్కినా కూడా.. భాజపా అలాంటి ప్రయత్నం చేయుకుండా.. సంకీర్ణ ధర్మం పాటిస్తూ మిత్రపక్షాలతో కలిసిన ప్రభుత్వాన్నే ఏర్పాటుచేసింది. అయితే భాజపా కూటమి నుంచి ఇదివరకే శివసేన వైదొలగగా.. ప్రస్తుతం తెలుగుదేశం కూడా బయటకు వస్తుండడంతో.. మోడీ ప్రభుత్వానికి పతనం ప్రారంభం అయినట్లేనని.. ఇది అందుకు సంకేతమే అని.. పలువురు భావిస్తున్నారు. ప్రత్యేకించి శివసేన ప్రతినిదులు మాట్లాడుతూ.. ఎన్డీయేలో ప్రస్తుతం అతి పెద్ద భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం కూడా బయటకు వెళ్లిపోవడంతో.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రమాదకరమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొన బోతున్నదని అంచనా వేస్తున్నారు.

మరోవైపు మిత్రధర్మం పాటించే విషయంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు లాంటివే వారు కూడా.. భాజపా మీద వినిపిస్తున్నారు. మిత్రపక్షాలతో ఎలా వ్యవహరించాలో మోడీ సర్కారుకు తెలియదని శివసేన ప్రతినిధులు అంటుండడం విశేషం. మిత్రపక్షాలను గౌరవించడం - వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మోడీ సర్కారుకు తెలియదనేది వారి ఆరోపణ.

వారి వైఖరిని తెలుగుదేశం పార్టీ మున్ముందుగా గుర్తించిందని.. వారి పోకడతో క్రమక్రమంగా అన్ని పార్టీలు కూడా ఎన్డీయే నుంచి పక్కకు తప్పుకునే పరిస్థితే ఏర్పడుతుందని శివసేన వ్యాఖ్యానిస్తోంది. ఒక రకంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి మోడీ సర్కారుకు ఇది ప్రమాద సంకేతం అవుతుందని వారు పేర్కొంటున్నారు.

సంకీర్ణ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం కూడా తాజాగా బయటకు రావడంతో.. భాజపా నిజస్వరూపం బయటపడుతూ ఉందనేది శివసేన మాట. మోడీ సర్కారు అతి ఆత్మవిశ్వాసంతో విర్రవీగుతున్నదని.. దానికి తొందర్లోనే చెక్ చెప్పే పరిస్థితి వస్తుందని వారు అంటున్నారు. ఇలా ఒక్కొక్క పార్టీ కూటమి నుంచి బయటకు వెళ్తూ ఉంటే.. భాజపాకు గడ్డుకాలం తప్పదని జోస్యం చెబుతున్నారు.

శివసేనకు ఎప్పటినుంచో భాజపా వారి వైఖరితో పొసగడం లేదు గనుక.. వారు తెదేపా చర్యలను సమర్థించడంలో చిత్రమేమీ లేదు. అయితే.. భాజపా బాగా చేస్తున్నది కాదు గానీ.. చంద్రబాబునాయుడు బంధం తెగడంలో.. తెదేపా వారి అత్యుత్సాహం కూడా చాలా ఉన్నదనే వాదనలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. మరి 2019 ఎన్నికలు ఎవరికి గడ్డుకాలమో కాలమే నిర్ణయించాలి.