Begin typing your search above and press return to search.

అద్వానీకి పట్టిన గతే మోడీకి పడుతుందా?

By:  Tupaki Desk   |   29 Dec 2015 4:27 AM GMT
అద్వానీకి పట్టిన గతే మోడీకి పడుతుందా?
X
మిత్రపక్షంగా ఉంటూ విపక్షం కంటే ఎక్కువగా కడిగేయటం శివసేనకు మాత్రమే చెల్లుతుంది. బీజేపీతో దీర్ఘకాల మిత్రుడిగా వ్యవహరిస్తున్న సదరు పార్టీ.. ఈ మధ్య కాలంలో మిత్రుడి మీద తరచూ కారాలు మిరియాలు నూరుతున్న సంగతి తెలిసిందే. రష్యా.. అఫ్ఘనిస్తాన్ పర్యటనలకు వెళ్లిన మోడీ భారత్ కు తిరిగి వచ్చే క్రమంలో.. అందరిని ఆశ్చర్యపరిస్తూ లాహోర్ పర్యటకు వెళ్లిన వైనం తెలిసిందే.

ఈ పర్యటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. శివసేన అంత ఘాటుగా.. సూటిగా.. విమర్శనాత్మకంగా విమర్శించిన వాళ్లు లేరనే చెప్పాలి. తాజాగా ఆ పార్టీ పత్రిక అయిన సామ్నాలో ప్రధాని పాక్ ఆకస్మిక పర్యటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇలాంటి పర్యటనలు ఏ మాత్రం మంచివి కాదన్న విషయాన్ని చెప్పేటమే కాదు.. తన వాదనకు బలమైన ఆధారంగా గతాన్ని చూపించటం గమనార్హం.

అనేక మంది అమాయక భారత పౌరుల రక్తంతో తడిసిన పాక్ గడ్డను ముద్దాడినందుకు మోడీ భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చంటూ తన పార్టీ పత్రిక అయిన సామ్నా సంపాదకీయంలో హెచ్చరించింది. గతంలోనూ పాక్ తో అనుబంధాన్ని నెరపిన పలువురు రాజకీయంగా దెబ్బ తిన్నారన్న ఉదాహరణను ఉటంకించటం గమనార్హం. పాక్ లో జిన్నా సమాధిని సందర్శించి.. ఆయన్ను పొగిడిన అద్వానీ నేను నామామాత్రపు నేతగా మిగిలారంటూ గతాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేసింది.

అదే విధంగా లాహోర్ బస్సు దౌత్యంతో నాటి ప్రధాని వాజ్ పేయ్ బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదన్న సదరు పత్రిక సంపాదకీయం మాటలు చూస్తే.. బీజేపీకి మూలస్తంభాలైన ఇద్దరు ప్రముఖులకే పాక్ తో షాక్ తగిలక తప్పలేదని.. మోడీ అందుకు మినహాయింపు కాదన్న మాటను చెప్పినట్లే. శివసేన అంచనా ఎంతవరకు నిజమవుతుందన్నది కాలమే సరైన సమాధానం ఇవ్వగలదేమో..?