Begin typing your search above and press return to search.

చంద్రబాబు కామెడీ పంచుతున్నారు..

By:  Tupaki Desk   |   20 May 2019 7:30 AM GMT
చంద్రబాబు కామెడీ పంచుతున్నారు..
X
చింత చచ్చినా పులుపు చావని చందంగా మారింది చంద్రబాబు పరిస్థితి అని ఆయన ప్రత్యర్థులు సెటైర్లు మొదలుపెట్టారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ వచ్చేసి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తాయని క్లియర్ కట్ గా ఆదివారం సాయంత్రం తేల్చేశాయి. ఇంత జరిగినా చంద్రబాబు మాత్రం ఢిల్లీలో తన పోరాటాన్ని ఏమాత్రం ఆపకపోవడం.. వెనక్కి తగ్గకపోవడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ, మోడీని గద్దెదించడమే ధ్యేయంగా ఇప్పటికీ చంద్రబాబు ఢిల్లీ లో ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశమవుతున్నారు.

చంద్రబాబు ఏపీలో సంక్షేమ జల్లు కురిపించారు. ఎన్నికల ముందర ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ ఓట్ల వాన కురిపిస్తాయని ఆశించారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. కేంద్రంలో మోడీని గద్దెదించాలని.. రాహుల్ ను ప్రధాని చేయాలని కంకణం కట్టుకున్న బాబుకు ఎగ్జిట్ పోల్స్ గుదిబండగా మారాయి. ఇంత జరిగినా ఢిల్లీలో ఇంకా చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు.

తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై బీజేపీ మిత్రపక్షం శివసేన ఎద్దేవా చేసింది. చంద్రబాబు ఢిల్లీలో కామెడీ పండిస్తున్నారని అపహాస్యం చేసింది. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో సోమవారం ఓ వ్యాసం ప్రచురితమైంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా చంద్రబాబు రాద్ధాంతం చేయడంపై కడిగిపారేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని శివసేన స్పష్టం చేసింది. మే 23న ఫలితాలు వచ్చి జ్ఞానోదయం అయ్యే వరకు బాబు ఇలానే చేస్తుంటాడని ఎద్దేవా చేసింది.

ఇక చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో కూడా ఓడిపోతారని సామ్నాలో శివసేన స్పష్టం చేసింది. అందుకే తన పని అయిపోయిందని విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విపక్ష పార్టీల ఐక్యత ఈనెల 23వ తేదీన తేలనుందని సామ్నాలో రాసుకొచ్చారు. విపక్షాలన్నీ కలిసినా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోరని పేర్కొన్నారు. బీజేపీ, శివసేన కూటమి 300కు పైగా సీట్లను సాధిస్తుందని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, శరద్ పవర్, అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతల ఆశలు ఈసారి కూడా నెరవేరవని శివసేన పత్రిక స్పష్టం చేసింది. విపక్షాల్లో నలుగురు ఐదుగురు పీఎం అభ్యర్థులున్నారని.. వారికి అధికారం ఇస్తే అంతే సంగతులు అనే ప్రజలు మోడీకి ఓటేశారని విమర్శించింది. 5వ విడత ముగియగానే అమిత్ షా 300కు పైగా సాధిస్తామని చెప్పారని.. అన్నట్టే అంతకు అందుకున్నామని శివసేన అభిప్రాయపడింది.

అయితే బీజేపీతో ఎప్పుడూ గొడవపడే శివసేన తాజా ఎన్నికల్లో మాత్రం పొత్తుకు అంగీకరించి కలిసి పోటీచేసింది. అయితే వీరిస్నేహం ఐదేళ్లు ఉండడం కష్టమేనంటున్నారు.. మహారాష్ట్ర ఎన్నికల నాటికి మళ్లీ చెడినా ఆశ్చర్యపోనక్కర్లేదని కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది.