Begin typing your search above and press return to search.

కంగనకు ఇచ్చి హత్రాస్ కుటుంబానికి ఇవ్వరా?: శివసేన

By:  Tupaki Desk   |   6 Oct 2020 5:38 PM GMT
కంగనకు ఇచ్చి హత్రాస్ కుటుంబానికి ఇవ్వరా?: శివసేన
X
మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన తాజాగా హత్రాస్ సంఘటనలో యూపీ సర్కార్ వ్యవహరించిన తీరును కడిగేసింది. బీజేపీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసింది.

అయోధ్య రామాలయ భూమిపూజతో యూపీలో రాజరాజ్యం వెలిసిందన్నారని.. కానీ రాక్షస రాజ్యం, ఆటవిక రాజ్యం నడుస్తోందని శివసేన నిప్పులు చెరిగింది. యూపీలో ఇంత జరుగుతున్నా ఢిల్లీ పాలకులకు గానీ.. యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వానికి గానీ చీమ కుట్టినట్టు అయినా లేదని విమర్శించింది. అత్యాచారం జరగలేదన్న యూపీ ప్రభుత్వం తీరుపై శివసేన మండిపడింది.

తాజాగా శివసేన సొంత పత్రిక సామ్నాలో ఈ మేరకు బీజేపీని కడిగేసింది. మహారాష్ట్రలో కల్లోలం సృష్టించడానికి వచ్చిన హీరోయిన్ కంగనా రౌనత్ కు వై కేటగిరి సెక్యూరిటీ ఇస్తున్నారని.. అదే హత్రాస్ బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించలేకపోతున్నారని శివసేన తన సంపాదకీయంలో విమర్శలు గుప్పించింది. ఒక పేద కుటుంబానికి ప్రాణహాని ఉందని.. బాధితురాలి కుటుంబానికి వై కేటగిరి భద్రత కల్పిస్తే తప్పేమిటని ప్రశ్నించింది.

హత్రాస్ కుటుంబం ఈ కేసులో జ్యూడిషియల్ దర్యాప్తు కోరిందని.. కానీ ప్రభుత్వం మాత్రం సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసిందని శివసేన మండిపడింది. బాధితురాలి కుటుంబం న్యాయ విచారణ చేసినప్పుడు ప్రభుత్వం సీబీఐకి కేసు ఎందుకు అప్పగించిందని మండిపడింది. ఈ కేసును నీరుగార్చేందుకే సీబీఐ దర్యాప్తు అని విమర్శించింది.

బాధితురాలి మృతదేహాన్ని అర్ధరాత్రి పోలీసులతో దహన సంస్కారాలు చేసి ఈ కేసును సాక్ష్యాలు లేకుండా సీబీఐకి అప్పగిస్తారా? అని యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ను శివసేన విమర్శించింది. హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించే నాయకులపై కూడా దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. లాఠీ చార్జి చేస్తున్నారని.. దళిత కుటుంబాన్ని అవమానిస్తున్నారని శివసేన నిప్పులు చెరిగింది.