Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ కు షాకిచ్చిన శివసేన

By:  Tupaki Desk   |   9 Dec 2021 9:31 AM GMT
ఫైర్ బ్రాండ్ కు షాకిచ్చిన శివసేన
X
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, ఫైర్ బ్రాండ్ అలియాస్ దీదీ కు శివసేన పెద్ద షాకే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సహకారం లేకుండా ఎన్డీయే ప్రత్యామ్నాయ కూటమి విజయం సాధించటం సాధ్యం కాదని మహారాష్ట్రలో అధికార పార్టీ స్పష్టంగా చెప్పింది. శివసేన కీలక నేత సంజయ్ రౌత్ మాట్లాడుతు కాంగ్రెస్ ను దూరంగా పెట్టాలన్న మమత ప్రయత్నాలు విజయవంతం కావని చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.

ఒకవైపే మమత శివసేన మద్దతు కోసం బాగా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో శివసేన కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడటం దీదీకి మింగుడుపడటంలేదు. మమత మహారాష్ట్ర అధికార కూటమిలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో తరచు భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ ను దూరంగా పెట్టాలనే విషయంలో పవార్ మద్దతు సంపాదించేందుకు దీదీ తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే పవార్ కూడా శివసేన రూట్లోనే కాంగ్రెస్ సహకారం లేకుండా ఎన్డీయే ప్రత్యామ్నాయం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు.

నిజానికి మమతకు ఇప్పటివరకు గట్టి మద్దతుదారుడు అంటు ఎవరు లేరు. ఈమధ్యనే మమత నేతృత్వంలోని కూటమిలో చేరటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒక్క అఖిలేష్ మద్దతున్నంత మాత్రాన ఏమీ జరిగిపోదు. అందులోను కాంగ్రెస్ లేని కూటమికే తాము మద్దతిస్తామని అఖిలేష్ చెప్పలేదు.

అఖిలేష్ ను వదిలేస్తే మరో గట్టి పార్టీయేదీ మమతకు మద్దతుగా ఇంతవరకు నిలబడలేదు. అంటే కాంగ్రెస్ లేని మూడో ప్రత్యామ్నాయం విషయంలో మమత చేస్తున్న ప్రయత్నాలు చాలాపార్టీలకు రుచించటం లేదని అర్ధమైపోతోంది. కాకపోతే శివసే, ఎన్సీపీలు మాత్రం ఇపుడు బయటపడ్డాయి. అందుకనే సంజయ్ రౌత్ మాట్లాడుతు కాంగ్రెస్ నేతృత్వంలోని మూడో కూటమినే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. దీనర్ధం ఏమిటంటే యూపీఏలోకే మమతను కూడా ఆహ్వానించటమే అని తెలుస్తోంది. మరి తాజా పరిణామాల విషయంలో ఫైర్ బ్రాండ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.