Begin typing your search above and press return to search.

రేప్‌లు అడ్డుకోలేని వారు..రామ‌రాజ్యం ఎలా తెస్తారు?

By:  Tupaki Desk   |   10 July 2018 2:10 PM GMT
రేప్‌లు అడ్డుకోలేని వారు..రామ‌రాజ్యం ఎలా తెస్తారు?
X
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని శూర్పణఖ అని - ప్రధాని మోడీని రాముడంటూ చేసిన వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్న బీజేపీ ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుడు సురేంద్రసింగ్.. ఆ పార్టీని ఇర‌కాటంలో ప‌డేసిన సంగ‌తి తెలిసిందే. పెరిగిపోతున్న లైంగిక వేధింపులపై మరోసారి నోరుజారి ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లైంగిక వేధింపులను రాముడే దిగొచ్చినా ఆపలేరంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లు పెద్ద దుమారం లేపాయి. అయితే ఈ ర‌చ్చ‌ ఇక్క‌డితోనే ఆగిపోలేదు. బీజేపీపై ఇటీవ‌లి కాలంలో ఒంటికాలిపై లేస్తున్న శివ‌సేన దీన్ని అవ‌కాశంగా తీసుకొని క‌మ‌ల‌నాథుల తీరును ఎద్దేవా చేసింది. అత్యాచారాల‌నే అరిక‌ట్ట‌లేని వారు రామ‌రాజ్యం ఎలా తెస్తార‌ని సూటిగా ప్ర‌శ్నించింది.

శనివారం వారణాసిలో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే సురేంద్రసింగ్ మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఉన్నావ్ లైంగిక వేధింపుల గురించి వెల్ల‌డిస్తూ `అలాంటి ఘటనలు జరుగకుండా రాముడు కూడా ఆపలేడు. ఇది సహజసిద్ధమైన కాలుష్యం. ఈ ఘటనలను విలువలతోనే అదుపు చేయగలం కానీ, రాజ్యాంగంతో కాదు`` అని సురేంద్రసింగ్ చెప్పారు. దీనిపై శివ‌సేన అధికారిక ప‌త్రిక సామ్నా సంపాద‌కీయం రాసింది. నిర్భ‌య ఉదంతాన్ని ప్ర‌స్తావిస్తూ...ఆరేళ్ల క్రితం ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు బీజేపీ ప్ర‌తిప‌క్షంలో ఉంద‌ని...అప్పుడే ప‌రిస్థితులు బాగుండేవ‌ని వ్యాఖ్యానించింది. స్వయంగా దేవుడే దిగివచ్చినా దేశంలో అత్యాచారాలను నిరోధించలేడని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలే శాంతిభద్రతలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందని తేటతెల్లం చేస్తున్నాయని ఎద్దేవా చేసింది. ప్రభుత్వాలు మారినా లైంగిక దాడులు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విష‌యంలో త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. మహిళల భద్రతను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది.

ఇక బీజేపీ జ‌పించే రామ‌రాజ్యం గురించి ప్ర‌స్తావిస్తూ శివ‌సేన సంపాద‌కీయం ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. మోడీ సార‌థ్యంలోని స‌ర్కారుతో రామ‌రాజ్య స్థాప‌న జ‌ర‌గ‌లేద‌ని వ్యాఖ్యానించింది. నిరుద్యోగ స‌మ‌స్య అలాగే ఉండిపోయింద‌ని, మ‌హిళ‌ల‌ భ‌ద్ర‌త‌పై సందేహాలు నెల‌కొన్నాయ‌న్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ చెప్తున్న రామ‌రాజ్యం సాధ్య‌మెలా అని ప్ర‌శ్నించింది. డ‌బ్బుల‌తో ఓట్లు సాధించ‌లేర‌ని, ఈ విష‌యం బీజేపీ గ‌మ‌నించాల‌ని కోరింది.