Begin typing your search above and press return to search.
శబరిమలకు మహిళలు వస్తే మూకుమ్మడి ఆత్మాహుతి!
By: Tupaki Desk | 14 Oct 2018 6:33 AM GMTశబరిమలలో అయ్యప్ప ఆలయానికి వయసులో ఉన్న మహిళలు వస్తే.. సామూహిక ఆత్మాహుతి చేసుకుంటామంటూ తీవ్రమైన హెచ్చరికను చేసింది శివసేన విభాగం. ఈ నెల 17 సాయంత్రం శబరిమల ఆలయం తెరుచుకోనుంది. ప్రతి నెలా పరిమితమైన రోజులు మాత్రమే దేవాలయాన్ని తెరుస్తారన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. శబరిమల దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రయర్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ.. ఆలయంలో ప్రవేశించే యుక్తవయసు మహిళల్ని పులులు పట్టేసుకుంటాయన్నారు. మరోవైపు శబరిమల ఆలయ దర్శనం కోసం రావాలనుకునే మహిళలకు పెద్ద ఎత్తున హెచ్చరికలు వెలువడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. తాజాగా కొచ్చిలోని అయ్యప్ప భక్తులు వేలాదిగా వీధుల్లోకి వచ్చారు. వారి భారీ నిరసనతో కొచ్చిన్ వీధులన్ని కిక్కిరిసిపోయాయి. అనవసరమైన ఉద్రిక్తతలు పెంచేలా ఉన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఒత్తిళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవటం మంచిదన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు
ఇందులో భాగంగా ఈ నెల 17న అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తున్నారు. మాస పూజల కోసం తెరుస్తున్నవేళ.. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఆలయాన్ని దర్శించాలన్న ఉద్దేశంతో శబరిమలకు వచ్చిన పక్షంలో తాము సామూహిక ఆత్మాహుతులకు పాల్పడతామని శివసేన కేరళ విభాగం చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. శివసేన హెచ్చరికతో శబరిమలలో అయ్యప్ప దర్శనానికి వచ్చే వారికి సంబంధించి కొత్త ఉద్రిక్తత మొదలైనట్లుగా చెప్పక తప్పదు.
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనానికి సంబంధించి సుప్రీం ఇచ్చిన తీర్పును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. ఇందులో భాగంగానే తాము ఆత్మాహుతికి బృందాలను ఏర్పాటు చేసినట్లుగా శివసేన కేరళ విభాగం వెల్లడించింది. ఈ ఆత్మాహుతి దళాల్లో మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. తమ మహిళా కార్యకర్తల బృందం ఈ నెల 17.. 18 తేదీల్లో పంబా నది సమీపంలో విడిది చేస్తారని.. ఏడుగురు సభ్యుల ఆత్మాహుతి బృందం అక్కడే సిద్దంగా ఉంటుందన్నారు.