Begin typing your search above and press return to search.

కెనడా ఎలక్షన్ లో తెలుగోడు గెలిచాడు

By:  Tupaki Desk   |   6 Sep 2015 11:31 AM GMT
కెనడా ఎలక్షన్ లో తెలుగోడు గెలిచాడు
X
అంతర్జాతీయ వేదికల మీద భారతీయుల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ మనోళ్లు చెలరేగిపోతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ మూలాలున్న బాబీ జిందాల్ పోటీపడాలన్న తపన తెలిసిందే. ఇదిలా ఉంటే అభివృద్ధి చెందిన దేశమైన కెనడాలో తెలుగువాడైన వ్యక్తి ఉప ఎన్నికల్లో పోటీ చేసి తాజాగా విజయం సాధించటం ఆసక్తికరంగా మరింది.

కెనడాలోని అల్బర్టా అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగు వ్యక్తి అయిన శివలింగ ప్రసాద్.. ‘‘పాండా వైల్ట్ రోజ్’’’ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆయనది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సంగం జాగర్ల మూడి గ్రామంగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన అదే గ్రామంలో హైస్కూల్ వరకు చదువుకొని తర్వాత కృష్ణా జిల్లా ఏజీ అండ్ ఎస్ జీ కాలేజీలో ఇంటర్ చదివినట్లు చెబుతున్నారు.

కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన.. అనంతరం ముంబయిలోని ముఖేష్ అంబానీ గ్రూప్ లోని రిలయన్స్ సంస్థలో పదహారేళ్లు పని చేసి.. తర్వాత కెనడా వెళ్లి స్థిరపడ్డారు. 2004 నుంచి అక్కడే ఉన్న ఆయన.. నాలుగేళ్ల క్రితం అక్కడి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పట్టువదలని ఆయన ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కెనడా అసెంబ్లీకి ఒక తెలుగువ్యక్త తొలిసారి గెలవటంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

ఇక.. శివలింగ ప్రసాద్ కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే.. విద్యార్థిదశలోనే స్టూడెంట్ ఎలక్షన్ లో పోటీ చేసి.. మాజీ ఎంపీ.. విభజన కారణంగా రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజ గోపాల్ పై పోటీ చేసి విజయం సాధించినన ఘన చరిత్ర ఉంది. అంతేకాదు.. ఏపీ మండలిలో సభ్యులైన వైబివీ రాజేంద్రప్రసాద్ ఆయనకు మంచి స్నేహితుడు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఆయనకు కాలేజీ మేట్. ఏది ఏమైనా ఒక తెలుగోడు దేశం కాని దేశంలో.. ఎమ్మెల్యే కావటం చిన్న విషయం కాదు.