Begin typing your search above and press return to search.

జగన్ పెళ్లికి మాజీ ఎంపీ శివప్రసాద్ అలా చేశారట!

By:  Tupaki Desk   |   22 Sept 2019 11:23 AM IST
జగన్ పెళ్లికి మాజీ ఎంపీ శివప్రసాద్ అలా చేశారట!
X
కొంతమంది మరణించిన తర్వాత.. వారికి సంబంధించి చాలానే యాంగిల్స్ బయటకు వస్తుంటాయి. రాజకీయంగా టీడీపీలో ఉన్నా.. పలు పార్టీ అధినేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్ననేతలు చాలా తక్కువ మంది ఉంటారు. రాజకీయంగా భిన్న భావజాలంతో ఉన్నా.. వ్యక్తిగతంగా ఇందుకు అతీతంగా సంబంధాలు ఉండే నేతల కోవకే చెందుతారు టీడీపీ మాజీ ఎంపీ.. తాజాగా అనారోగ్యంతో మరణించిన శివప్రసాద్.

సినిమా.. రాజకీయ రంగంలో వివిధ వర్గాల వారితో ఆయనకున్న సంబంధాలు పార్టీలకు అతీతమని చెబుతారు. తాజాగా ఆయన కన్నుమూసిన నేపథ్యంలో శివప్రసాద్ కు చెందిన ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని వైరల్ గా మారి అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాయి.

టీడీపీకి చెందిన నేత అయినప్పటికీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డితో శివప్రసాద్ కు అనుబంధం ఎక్కువ. ఆయనతో ఉన్న పరిచయం కారణంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ తరఫున 1996లో తిరుపతి ఎంపీ టికెట్ ను శివప్రసాద్ కు ఆఫర్ చేశారు. అయితే.. ఈ ప్రయత్నానికి మరో నేత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అడ్డుపడటంతో ఆయనకు టికెట్టు దక్కలేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వ్యక్తిగతంగా రాజారెడ్డితో ఉన్న అనుబంధం కారణంగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెళ్లి నేపథ్యంలో తిరుపతి నుంచి శివప్రసాద్.. తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిలు కలిసి వంద వాహనాల్లో జనాల్ని తీసుకెళ్లిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాజారెడ్డితో అంతటి అనుబంధం ఉన్న శివప్రసాద్ తర్వాతి కాలంలో టీడీపీలో చేరినా.. ఆయనతో అనుబంధం మాత్రం తగ్గలేదని చెబుతారు.

ప్రేమ తపస్సు సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వేళ..తిరుపతి ఎంపీ టికెట్టు ఆఫర్ ను టీడీపీ నుంచి వచ్చింది. అయితే.. అప్పట్లో సినిమాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి వెళ్లటం ఇష్టం లేక ఓకే చెప్పలేదంటారు. అంతేకాదు.. ప్రముఖ నటి కమ్ నగరి ఎమ్మెల్యే రోజా ఎంట్రీలోనూ శివప్రసాద్ కీలకమన్న సంగతి తెలిసిందే.