Begin typing your search above and press return to search.

కమలనాథులకు కరెంటు సాక్ గా శివాజీ మాటలు

By:  Tupaki Desk   |   15 May 2016 3:46 PM GMT
కమలనాథులకు కరెంటు సాక్ గా శివాజీ మాటలు
X
అధికారం చేతిలో ఉంటే తమను తాము చాలా గొప్పగా ఫీలయ్యే అధినేతలు కొందరుంటారు. తమకు తిరుగులేదన్న భావనలో చాలా విషయాల్ని మర్చిపోతుంటారు. ప్రతి గెలుపు మరో ఓటమికి నాంది అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే ఫర్లేదు కానీ.. తాము సాధించిన విజయంతో తమకిక ఎదురులేదని ఫీలయ్యే వారితోనే ఇబ్బంది అంతా. తాజాగా బీజేపీ నేతల తీరు ఇదే రీతిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మిత్రపక్షాలతో ఎంత ఒద్దికగా వ్యవహరించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ పార్టీలతో జత కట్టినా.. అందరం సమానమే అన్నట్లుగా వ్యవహరించిన కమలనాథులు.. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక వారి తీరు పూర్తిగా మారింది.

అధికారం అణుకువను తేవాల్సింది పోయి అహంకారంగా మారిందన్న ఆరోపణలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తమకిక తిరుగులేదన్నట్లుగా వారి తీరు మారటం.. మోడీ సూపర్ పవర్ గా మారిపోయారని.. మరో పదేళ్ల వరకూ తమకిక తిరుగులేదన్నట్లుగా వారి మాటలు వినిపిస్తున్నాయి. ఇదే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని తూచ్ అనేలా చేసిందని చెప్పొచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదన్న పిచ్చి లెక్క ఒకటి బీజేపీ అధినాయకత్వంతో రావటం.. ఏపీకి సాయం ప్రకటిస్తే.. మరిన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుందన్న అర్థం లేని వాదనతో ఏపీకి హ్యాండ్ ఇచ్చేందుకు రెఢీ అయ్యారు.

వాస్తవానికి ఏపీతో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదన్న విషయం చరిత్రను చూస్తే అర్థమవుతుంది. అదే సమయంలో ఏపీ సాయంతో అధికారానికి ఎదిగిన వైనం కనిపిస్తుంది. తెలుగోళ్లతో పెట్టుకున్న ఇందిరమ్మ.. రాజీవ్ లకు ఎలాంటి షాక్ తగిలిందో తెలిసిందే. అదే సమయంలో అదే తెలుగోళ్లను నమ్ముకున్న సోనియమ్మను తెలుగోళ్లు ఎక్కడికి తీసుకెళ్లారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విభజన విషయంలో సోనియమ్మ తీసుకున్న తొందరపాటు ఆమెకు రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని దూరం చేయటమే కాదు.. కేంద్రంలోనూ పవర్ పోయేలా చేసింది.

విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కాంగ్రెస్.. బీజేపీలు పోటాపోటీగా హామీలు ఇవ్వగా.. అధికారంలోకి వచ్చిన మోడీ అండ్ కో మాత్రం చేతులు ఎత్తేస్తూ ప్రత్యేకహోదా సాధ్యం కాదని తేల్చేశారు. కమలనాథులు కుండబద్ధలు కొట్టిన వైనంపై సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సీమాంధ్రులకు తగ్గట్లే ఏపీ అధికార.. విపక్షాలు సైతం కమలనాథుల మీద విమర్శలు చేస్తున్నారు. అయితే.. అవేమీ సినీ నటుడు శివాజీ మాటల ముందు చిన్నబోతాయని చెప్పాలి. తాజాగా బీజేపీ మీద శివాజీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కోట్లాది సీమాంధ్రుల మనసుల్లో ఉన్న ఆవేశానికి రూపంగా శివాజీ మాటలుగా చెప్పొచ్చు. విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన వ్యక్తిని.. ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన బీజేపీ సీనియర్ నేతల చెంపలు వాయించాలని.. ఆ తర్వాత వారిని ఏపీకి తీసుకొచ్చి ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని వారితో చెప్పిస్తారా? అంటూ ప్రత్యేక హోదా అవసరం లేదన్న వారిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. విభజనతో గొంతు కోసిన కాంగ్రెస్ తో పోలిస్తే.. నమ్మించి ఏపీని నట్టేట ముంచుతున్న బీజేపీ ఏపీ ప్రజల్ని ఎక్కువగా నష్టం చేస్తున్నట్లు మండిపడ్డారు. రాజకీయ పార్టీల కుట్రల్ని చూస్తూ ఊరుకోమని.. వారి కుట్రలపై ఏపీ ప్రజల్లో నిత్యం అవగాహన కల్పిస్తామంటూ శివాజీ ఫైర్ అవుతున్నారు.