Begin typing your search above and press return to search.

ఫైట్ ఫ‌ర్ రైట్..శివాజీ ఘాటు అందరిలో రావాలి

By:  Tupaki Desk   |   11 Aug 2015 2:20 PM GMT
ఫైట్ ఫ‌ర్ రైట్..శివాజీ ఘాటు అందరిలో రావాలి
X
ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో భాగంగా ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేఏ దిశలో హీరో శివాజీ ఉన్నారా? ఈ క్ర‌మంలోనే బీజేపీని ఆయ‌న టార్గెట్ చేస్తున్నారా?ప‌వ‌న్ వ్య‌తిరేకం కాదంటూ.. జ‌గ‌న్ దీక్ష చేబూన‌డం స‌బ‌బు అంటూ ఏక‌కాలంలో రెండు పార్టీల‌కూ ఆయ‌న చేరువ అవుతున్నారా? అంటే ఔననే అంటున్నాయి ప‌రిణామాలు. ప్ర‌త్యేక హోదాపై కేంద్రం చెబుతున్న‌వ‌న్నీ సొల్లు క‌బుర్లేన‌ని తేల్చేస్తూ.. ఓ పెద్ద మ‌నిషీ నువ్వు మాట‌లు ఆపు అంటూ వెంక‌య్య‌ను ఉద్దేశిస్తూ.. నిప్పులుచెరిగారు. హోదా అన్న‌ది బిక్ష కాద‌ని అది ఆంధ్రుల హ‌క్కు అని అంటూనే.. విభ‌జ‌న బిల్లులో ఈ అంశాన్ని చేర్చ‌లేద‌న‌డం స‌మంజ‌సం కాద‌ని మండిప‌డుతున్నారు.

అంతేకాదు బీజేపీ ఆంధ్రుల ద్రోహుల పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆత్మాహుతి వ‌ల్లే ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ ద‌క్కుతుందంటే తాను అందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, ద‌య‌చేసి! యువ‌త ఎవ్వ‌రూ ప్రాణ‌త్యాగాల‌కు ఒడిగట్ట‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. హోదాపై ఉద్య‌మం మొద‌లు పెట్టిన రోజు తాను ఒక్క‌డినేన‌ని ఇప్పుడు ల‌క్ష‌ల మంది త‌న‌తో క‌లిసి న‌డుస్తుండ‌డం ఆనంద‌దాయ‌కంగా ఉంద‌న్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కారణాలు వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కు లేఖ‌లు రాసిన‌ట్లు తెలిపారు. మొత్తంగా శివాజీ అటు జ‌గ‌న్‌ ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఢిల్లీలో నిన్న‌టి వేళ యువ‌నేత దీక్ష‌కు పూనుకోవ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని అభివ‌ర్ణించారు.

అదేవిధంగా ప‌వ‌న్‌ కు తానేమీ వ్య‌తిరేకం కాద‌ని ఆయ‌న కూడా ఈ మ‌హోద్య‌మంలో క‌లిసివ‌స్తే ఫ‌లితాలు సిద్ధిస్తాయ‌న్న‌దే నా భావ‌న అని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న భావనతో యువత ఆందోళన చెందుతోందని, వారిని అయోమయానికి గురి చేసే ప్రకటనలు మాని, ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రధాని మోడీపై ఎంపీలంతా ఒత్తిడి పెంచాల‌ని పిలుపునిచ్చారు. అంతేకాదు భ‌విష్య‌త్‌ లో త‌న‌కు రాజ‌కీయాల్లోకి రావాల‌ని లేద‌ని మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. మొత్తంగా చూసుకుంటే ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మాఖ్య త‌ర‌ఫున చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌, కారెం శివాజీ, వామ‌ప‌క్ష నేత‌ల‌తో క‌లిసి ఢిల్లీ వేదిక‌గా శివాజీ మ‌రింత దూసుకుపోవాల‌ని యోచిస్తున్నారు.

జ‌గ‌న్‌, ప‌వ‌న్‌, శివాజీ ఫ్యాక్ట‌ర్ ఇప్ప‌టికిప్పుడు సాధ్యం కాక‌పోయినా.. భ‌విష్య‌త్‌లో ఈ ఇద్ద‌రినీ వేర్వేరుగా క‌లిసి త‌న ఉద్య‌మానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే యోచ‌న‌లో శివాజీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అదే గ‌నుక జ‌రిగితే శివాజీ జాతీయ స్థాయిలో మ‌రింత గుర్తింపు తెచ్చుకోవ‌డ‌మే కాక, కేంద్రం మెడ‌లు వంచ‌డం కూడా.. సుసాధ్యం కావ‌చ్చు. మ‌రోవైపు బీహార్ ఎన్నిక‌ల త‌రువాత త‌మ పార్టీ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌నుంద‌ని కొంద‌రు బీజేపీ పెద్ద‌లు చెబుతుండ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే హోదా సాధ‌న కోసం ఆత్మాహుతికి సైతం యువ‌త సిద్ధ‌ప‌డుతుండ‌గా కేంద్రం మాత్రం యథాలాపంగా చోద్యం చూస్తోంది.