Begin typing your search above and press return to search.

శివాజీ క్వ‌శ్చ‌న్‌!... ప్ర‌శ్నిస్తే దాడులు చేస్తారా?

By:  Tupaki Desk   |   21 Feb 2018 10:34 AM GMT
శివాజీ క్వ‌శ్చ‌న్‌!... ప్ర‌శ్నిస్తే దాడులు చేస్తారా?
X

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పిన బీజేపీ... అధికారం ద‌క్క‌గానే ఆ మాట‌ను తుంగ‌లో తొక్కేసి ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని మాయ మాట‌లు చెప్పి... చివ‌ర‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంపైనా స్ప‌ష్టమైన వైఖ‌రి ప్ర‌క‌టించకుండా నాన్చుతున్న తీరుపై ఏపీవ్యాప్తంగా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో నేటి మ‌ధ్యాహ్నం ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చా వేదిక‌లో ఏపీకి అన్యాయం జ‌రిగిన తీరుపై త‌న‌దైన శైలి వాద‌న వినిపించిన టాలీవుడ్ హీరో - ఒక‌ప్ప‌టి బీజేపీ నేత శివాజీపై ఆ పార్టీ శ్రేణులు దాడికి య‌త్నించి సంచ‌ల‌నం రేపాయి. ఈ ఘ‌ట‌న లైవ్‌ లో ప్ర‌సారం కావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌ గా మారిపోయింది. త‌న‌పై జ‌రిగిన దాడిని ఖండించిన బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన శివాజీ... ఆ త‌ర్వాత త‌నదైన శైలిలో బీజేపీపై ఫైర‌య్యారు. గ‌తంలో తాను బీజేపీలోనే ఉన్నాన‌ని - నాడు బీజేపీ గెలుపు కోసం కుక్క‌లా ఇంటింటికీ తిరిగాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన శివాజీ... ఇప్పుడు ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని ఉద్య‌మిస్తే దాడుల‌కు పాల్ప‌డుతారా? అంటూ సూటి ప్ర‌శ్న‌లు సంధించారు. అస‌లు బీజేపీ సంస్కృతి ఇదేనా? అన్న శివాజీ ప్ర‌శ్న‌కు బీజేపీ నుంచి స్పంద‌న క‌నిపించే ప్ర‌స‌క్తే లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌న‌పై దాడి య‌త్నం జ‌రిగిన త‌ర్వాత చ‌ర్చా వేదిక‌పై నుంచే మాట్లాడిన శివాజీ... బీజేపీ తీరును క‌డిగిపారేశార‌నే చెప్పాలి.

అయినా శివాజీ ఈ సంద‌ర్భంగా ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *2014 ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటేయాలని కుక్కలాగా ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదంటే బీజేపీ నేతలు తమపై దాడులకు దిగుతున్నారు. నేను బీజేపీలో ఉన్న సమయంలో నాపై దాడికి పాల్పడిన వారెవరూ కూడా పార్టీలో లేరు. ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కోరితే తప్పా? 2014 ఎన్నికల సమయంలో ఏపీని అన్ని రకాలుగా ఆదుకొంటామని ఆనాడు బీజేపీ హమీ ఇచ్చింది. ఈ కారణంగానే నేను ఆనాడు బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించా. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్ - పరిశ్రమలు ఇతర సంస్థలను ఇస్తామని ఆనాడు బీజేపీ హమీ ఇచ్చింది. అయితే ఈ విషయాలను ప్రశ్నిస్తే బిజెపి నేతలు దాడులకు పాల్పడుతున్నారు. ఎన్ని దాడులకు పాల్పడిన తాను వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు* అని శివాజీ వ్యాఖ్యానించారు.

అంత‌టితోనే ఆగ‌ని శివాజీ... *మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఏమైనా చేయండి. నామీద దాడి చేయండి. చంపండి. కానీ నా చావుతోనైనా తెలుగువాళ్లంతా ఒక్కటై తిరగబడతారు. నేను మరణిస్తే, నా లాంటివారు వంద మంది పుడతారు. వారి ఆగ్రహానికి బీజేపీ నాశనమవుతుంది. హోదాపై తన వాదనేంటో బీజేపీ నాయకులు తెలియజేయాలి. అంతే తప్ప ప్రశ్నించేవారిపై దాడులు చేస్తే సహించేది లేదు. ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి బీజేపీ నేతలు అలవాటు చేసుకొన్నారు. ఎన్నడూ క్రమశిక్షణ తప్పని వారు ఇప్పుడు ఇలా ఎందుకు అసహనాన్ని పెంచుకుంటున్నారు? ఇదా భారతీయ జనతా పార్టీ? ఇలాగేనా మీరు చేసేది? దమ్ముంటే, మీకు చేతనైతే బీజేపీ వాదనను ప్రజలకు వివరంగా చెప్పాలి. చెప్పలేకుంటే తప్పు ఒప్పుకోండి* అని శివాజీ త‌న‌దైన శైలిలో బీజేపీపై ఊగిపోయారు.