Begin typing your search above and press return to search.

రాజా క‌న్నీళ్లకు ఓట్లు రాల‌లేదు!

By:  Tupaki Desk   |   12 March 2019 5:35 PM GMT
రాజా క‌న్నీళ్లకు ఓట్లు రాల‌లేదు!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో శివాజీ రాజా గెల‌వ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చార‌మైంది. కానీ అనుకున్న‌దొకటి.. అయిన‌ది ఇంకొక‌టి! .. శివాజీ రాజా మా ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు. ఆయ‌న స్థానంలో సీనియ‌ర్ న‌రేష్ `మా` అధ్య‌క్షుడిగా గెలిచారు. ప్ర‌స్తుతం ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. అలాగే న‌రేష్ ప్యానెల్ 2019-20 సీజ‌న్ లో చేయాల్సిన ప‌నుల‌పైనా దృష్టి సారించింది. ఈ సంద‌ర్భంలో ఓ విష‌యం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

స‌రిగ్గా `మా` ఎన్నిక‌ల‌కు ఒక‌రోజు ముందు త‌న‌పై సీనియ‌ర్ న‌రేష్ ప్యానెల్ విమ‌ర్శ‌ల‌కు పూర్తిగా దిగాలు ప‌డిపోయిన శివాజీ రాజా మీడియా ముందే ఆవేద‌న‌తో నోట మాట రాకుండా అయిపోయాడు. ఎంతో ఉద్వేగానికి లోనై క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. రెండు నిమిషాల పాటు మాట్లాడ‌లేక‌పోయాడు. నా భార్య నేను- నా కుటుంబం హైద‌రాబాద్ వ‌దిలి అరుణాచ‌లం వెళ్లిపోదామ‌ని అనుకున్నాం. అంద‌రూ పోటీ చేయ‌మంటేనే పోటీ చేస్తున్నా! అని అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో శ్రీ‌కాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి స్నేహితులు లేకుంటే ఏమయ్యేవాడినోన‌ని ఆవేద‌న చెందారు. ప్ర‌త్యర్థి ప్యానల్ చేసిన విమ‌ర్శ‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చేందుకే మీడియా ముందుకు వ‌చ్చాన‌ని .. వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోతే అంతా అదే నిజ‌మ‌ని న‌మ్మేస్తార‌ని ఆవేద‌న చెందాడు శివాజీ రాజా.

అయితే ఎన్నిక‌ల ఫ‌లితం తేల‌డంతో తానొక‌టి త‌లిస్తే పైవాడు ఇంకొక‌టి త‌లిచారు అని అర్థ‌మైంది. శివాజీ రాజా ఎన్నిక‌ల కౌంటింగ్ రోజే పుష్ప‌గుచ్ఛంతో న‌రేష్ ని అభినందించి ఆ త‌ర్వాత క‌నిపించ‌లేదు. న‌రేష్‌ ప్ర‌మాణ స్వీకారం వేళ శివాజీ వ‌చ్చి అత‌డికి బాధ్య‌త‌లు అప్ప‌గించి వెళ‌తారేమో చూడాలి. ఇక‌పోతే ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో శివాజీ రాజా ఎమోష‌న్ ని అది నిజంగా ప‌ని చేసిన నాయ‌కుడి క‌ల‌త అలా ఉంటుంద‌ని శ్రీ‌కాంత్ అన్నారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో శ్రీ‌కాంత్ కూడా ఓట‌మి పాల‌వ్వ‌డం ఊహించ‌నిది. శివాజీరాజా- శ్రీ‌కాంత్ ఓట‌మి పాలైనా ఈ ప్యానెల్ లో ఓ న‌లుగురు తిరిగి కొత్త క‌మిటీలో చోటు సంపాదించుకోవ‌డం ఇక్క‌డో కొస‌మెరుపు. అంటే ఆర్టిస్టుల్ని ప్ర‌భావితం చేయ‌డంలో న‌రేష్ ప్యానెల్ ప‌థ‌కం ప‌క్కాగా వ‌ర్క‌వుటైంద‌ని అర్థం చేసుకోవాలా? లేక శివాజీరాజా - శ్రీ‌కాంత్ బృందాన్ని ఆర్టిస్టులు న‌మ్మ‌లేద‌ని, పెద్ద‌ల అండ వీరికి ద‌క్క‌లేద‌ని అర్థం చేసుకోవాలా? అంటూ ఆస‌క్తిగా చ‌ర్చ సాగుతోంది. ఇక 2018లో శ్రీ‌రెడ్డి వివాదంలో ప‌లువురు ఇండ‌స్ట్రీ పెద్దల పేర్లు రావ‌డం వంటి వాటిని శివాజీ రాజా బృందం అదుపు చేయ‌లేక‌పోయింది. అలాగే మెగా నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం అనంత‌రం త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లకు స‌రైన ఆన్స‌ర్ ఇవ్వలేక‌పోయారు. ఇంకా ఎన్నో కార‌ణాలు ఈ ఓట‌మికి కార‌ణ‌మా? అంటూ ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు.