Begin typing your search above and press return to search.

నాగ‌బాబుకు ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ట్ పై క్లారిటీ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   21 March 2019 6:34 AM GMT
నాగ‌బాబుకు ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ట్ పై క్లారిటీ వ‌చ్చేసింది
X
తెలుగు రాజ‌కీయాల్లో ఇప్పుడంతా రిట‌ర్న్ గిఫ్ట్ హ‌డావుడే న‌డుస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రావ‌టం.. అంచ‌నాల‌కు మించి కాంగ్రెస్.. టీడీపీ కూట‌మి దారుణ ఓట‌మిని మూట‌క‌ట్టుకోగా.. తాను మొద‌ట్నించి చెప్పిన రీతిలోనే కేసీఆర్ ఘ‌న విజ‌యాన్ని సాధించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌.. తానుచంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో రివెంజ్ కు స‌రికొత్త ప‌దంగా మారింది.

ఇదిలా ఉంటే. ఇటీవ‌ల జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో శివాజీరాజా.. న‌రేష్ ప్యాన‌ళ్ల మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌ర‌గ‌టం.. న‌రేష్ వ‌ర్గానికి ఆఖ‌రి నిమిషంలో నాగ‌బాబు మ‌ద్ద‌తు ఇవ్వ‌టంతో తుది ఫ‌లితం వేరుగా వ‌చ్చింద‌ని చెబుతారు. శివాజీ రాజా ఓట‌మికి నాగ‌బాబు చేసిన ప్ర‌చారం కూడా కార‌ణంగా చెబుతారు. ఇదిలా ఉంటే.. శివాజీరాజా.. న‌రేష్ వ‌ర్గం మధ్య మాట‌ల యుద్ధం ముద‌ర‌టం.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌టం తెలిసిందే.

ఇటీవ‌ల ప్రెస్ మీట్ పెట్టిన శివాజీరాజా నాగ‌బాబు ప్ర‌స్తావ‌న తెచ్చి.. త‌న ఓట‌మికి కార‌ణ‌మైన మెగా బ్ర‌ద‌ర్ కు రిట‌ర్న్ గిఫ్ట్ త‌ప్ప‌క ఇస్తాన‌ని చెప్ప‌టం సంచ‌ల‌నంగా మారింది. నాగ‌బాబుకు శివాజీరాజా ఏ రీతిలో రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. దీనిపై తాజాగా క్లారిటీ వ‌చ్చేసింది. జ‌న‌సేన త‌ర‌ఫున నాగబాబు ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న వేళ‌.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా శివాజీ రాజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తార‌ని చెబుతున్నారు.

న‌ర‌సాపురం ఎంపీ స్థానానికి జ‌న‌సేన అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన నాగ‌బాబుకు వ్య‌తిరేకంగా శివాజీరాజా ప్ర‌చారం తీవ్ర‌త‌రం చేయ‌టం ద్వారా.. ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను ఓడించి రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌న్న‌దే శివాజీ రాజా ఆలోచ‌న‌గా చెబుతున్నారు. నాగ‌బాబును ఇరుకున‌పెట్టేందుకు వీలుగా అస్త్ర‌శ‌స్త్రాల్ని శివాజీరాజా సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఏపీ రాజ‌కీయాల్లో మ‌రిన్ని రిట‌ర్న్ గిఫ్ట్ ఉదంతాలు తెర మీద‌కు రావ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.