Begin typing your search above and press return to search.

పవన్.. శివాజీని చేరదీస్తే ప్రాబ్లమేంటి?

By:  Tupaki Desk   |   2 March 2018 7:59 AM GMT
పవన్.. శివాజీని చేరదీస్తే ప్రాబ్లమేంటి?
X
హీరో పవన్ కల్యాణ్ జన సేన పార్టీ అధినేతగా.. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని రెండో డైమెన్షన్ లోకి తీసుకువెళ్లడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. పోరాటమూ రోడ్లెక్కడమూ జనజీవితాన్ని ఇబ్బంది పరుస్తాయి గనుక తనకు ఇష్టం లేదని అంటున్న పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా వచ్చి తీరాల్సిందేనంటూ గళమెత్తడంలో మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. అన్ని పార్టీలను కలుపుకుపోవడం కూడా తనకు ఇష్టమే అంటున్నారు. ఆ రకంగానే జేఎఫ్‌సీని తయారుచేశారు. తటస్థుల్ని , కలిసి వచ్చిన పార్టీల వారిని అందులో ఉంచారు.

అంతా బాగానే ఉంది.. అయితే ప్రజల వైపు నుంచి పవన్ కల్యాణ్ కు మరో సూచన వస్తోంది. ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా.. ప్రత్యేకహోదా కోసం చాలా కాలంగా.. అలుపెరగకుండా పనిచేస్తూనే ఉన్న మరో నటుడు శివాజీ ఉన్నారు. ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ కు సంబంధించినంత వరకు ఎక్కడ ఎలాంటి ఉద్యమం ఉన్నా తాను స్వయంగా పాల్గొంటూ భేషజాలకు పోకుండా.. పోరాటాన్ని సమర్థిస్తున్నారు. గతంలో భాజపాలో ఉన్నప్పటికీ.. హోదా విషయంలో వంచించినందుకు విభేదించి బయటకు వచ్చి మరీ.. శివాజీ పోరాటం సాగిస్తున్నారు. అలాంటి శివాజీని కూడా పవన్ కల్యాణ్ తన పోరాటంలో జతచేసుకుంటే బాగుంటుంది కదా అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. శివాజీ మీద ప్రస్తుతానికి పార్టీ ముద్ర లేదు. ఆయన పవన్ నాయకత్వం పట్ల ఎన్నడూ తేడాగా మాట్లాడనూ లేదు. మరి అలాంటప్పుడు పవన్ - శివాజీని తన పార్టీలో చేరదీసి.. ముందుకు నెడితే తప్పేముంది అనే వాదన వినిపిస్తోంది.

కొన్ని రోజుల కిందట విజయవాడలో శివాజీ ఓ టీవీ చర్చలో పాల్గొంటున్న సమయంలో భాజపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పవన్ కల్యాణ్ శివాజీ పేరు ప్రస్తావించకుండా.. ఆ దాడిని ఖండించారు. అంతే తప్ప.. శివాజీకి ఆయన జెఎఫ్‌ సి తరఫు కూడా ఆహ్వానం అందలేదు. అలాగే తొలినుంచి హోదా కోసం ఉద్యమిస్తున్న వైసీపీ పట్ల కూడా కలుపుకుపోవడంలో పవన్ తేడాగానే ఉన్నారనే విమర్శలున్నాయి.

తాజాగా శివాజీ విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంతో ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్.. ప్రత్యేకహోదా ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరారు. కాకపోతే.. కమిటీలు నివేదికలతో కాలహరణం మానేసి... రోడ్డెక్కి పోరాడాలని పిలుపు ఇచ్చారు.

ఇలాంటి నేపథ్యంలో శివాజీని కూడా కలుపుకుంటే.. జనసేన పార్టీకి కూడా మంచిదే కదా.. అనే సలహా వినిపిస్తోంది. లోక్ సత్తా పార్టీలాగా ఏకవ్యక్తి పార్టీలాగా కాకుండా.. జనసేనలో ప్రజల ముందు మాట్లాడ్డానికి తగిన ఇమేజి ఉన్న నాయకులు మరికొందరు విధిగా ఉంటే మంచిదని.. శివాజీ కూడా ఉపయోగపడతాడని పలువురు అంటున్నారు.