Begin typing your search above and press return to search.

శివసేన-బీజేపీ..వాళ్లకు ఇవ్వన్నీ మామూలే!

By:  Tupaki Desk   |   29 Oct 2019 10:38 AM GMT
శివసేన-బీజేపీ..వాళ్లకు ఇవ్వన్నీ మామూలే!
X
ఇప్పుడు కాదు.. గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడే ఈ రెండు పార్టీలూ కలహించుకున్నాయి. అప్పుడు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నా ఇవి చేతులు కలపలేదు. సీట్ల పంపకం విషయంలో విబేధించుకున్నాయి. దీంతో వేర్వేరుగా పోటీ చేశాయి. ఎన్నికల ముందు అలా గొడవలు పడి విబేధించుకున్నా పార్టీలు ఎన్నికల తర్వాత మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి!

అలా చేతులు కలిపినా.. మళ్లీ కలహాలు కొనసాగాయి. ఒక పార్టీ లేనిదే మరో పార్టీకి అధికారం అందదు. అదీ బీజేపీ-శివసేనల పరిస్థితి. దాదాపు ఒకే రకమైన అజెండాలతో - కాషాయ జెండాలతో ఈ పార్టీలు జనాల్లోకి వెళ్తాయి. మహారాష్ట్ర వాదం శివసేనకు ప్రాణం. బీజేపీకి హిందుత్వ జాతీయ వాదం అజెండా. ఈ నేఫథ్యంలో ప్రతి సారీ చెరో కొన్ని సీట్లు సాధించడం - కలిసి సాగడం వీటికి అలవాటు.

అయితే అధికారాన్ని అందుకునే సమయాల్లో మాత్రం గొడవలు పడుతూ ఉంటాయి. అయితే చివరకు మాత్రం ఈ రెండు పార్టీలూ కలిసి పోతాయి. కాంప్రమైజ్ అవుతాయి. బహుశా ఇప్పుడు కూడా అదే జరుగుతుందని పరిశీలకులు అంచనా వేస్తూ ఉన్నారు.

అయితే తమకు ప్రత్యామ్నాయాలున్నాయని శివసేన గట్టిగా చెబుతూ ఉంది. కాంగ్రెస్ - ఎన్సీపీలతో చేతులు కలపడమే శివసేనకు ఉన్న ప్రత్యామ్నాయం. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో శివసేన అలా చేయగలదంటే మాత్రం చాలా మంది నమ్మలేకపోతున్నారు! కాబట్టి.. బీజేపీ-సేనలు చేతులు కలపడం మాత్రం ఖాయమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.