Begin typing your search above and press return to search.

శివసేన..అనుకున్నది సాధిస్తుందా..?!

By:  Tupaki Desk   |   3 Oct 2019 6:26 AM GMT
శివసేన..అనుకున్నది సాధిస్తుందా..?!
X
ఎలాగైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనేది శివసేన ఫస్ట్ ఫ్యామిలీ ఆశ. ఇందు కోసం చాలానే ప్రయత్నాలు సాగించారు. అయితే ఇప్పటి వరకూ విజయవంతం కాలేదు. మహారాష్ట్రలో మొదటి నుంచి కాంగ్రెస్ బలంగా ఉంటూ వచ్చింది. ఎన్సీపీ రూపంలో చీలిక వచ్చినా.. మళ్లీ ఇరు పార్టీలూ చేతులు కలిపాయి. అధికారాన్ని పంచుకుంటూ వచ్చాయి.

అయితే ఐదేళ్ల కిందట ఆ పార్టీలకు మహా ప్రజలు చెక్ చెప్పారు. బీజేపీ-శివసేనలకు టైమొచ్చింది. అయితే అప్పటి వరకూ బీజేపీని తమ్ముడిగా చేసుకుంటూ, తను పెద్దన్నగా చలామణి అయ్యింది శివసేన. కానీ తీరా అధికారం దగ్గరకు వచ్చినప్పుడు బీజేపీ తోక జాడించింది. తనే పెద్దన్నగా మారింది. శివసేనను తోక పార్టీగా చేసుకుంది. అక్కడ నుంచి అదే తీరే కొనసాగుతూ ఉంది.

దీంతో అడపాదడపా శివసేన వాళ్లు బీజేపీని విమర్శిస్తూ వచ్చారు. మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ విధానాలను తప్పు పట్టారు. అయితే చివరికేమో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. పొత్తు కుదిరింది. శివసేన ఇప్పుడు పెద్దగా బెదిరించేది, బెట్టు చేసేది లేకుండా పోయింది. బీజేపీ చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి.

కేంద్రంలో మోడీ ఎంత పవర్ ఫుల్ గా ఉన్నారో అందరికీ తెలిసిన సంగతే. దీంతో సేన బీజేపీ దారిలో నడవాల్సి వస్తోంది. అయితే తొలి సారి ఠాక్రేల ఫ్యామిలీ ఎన్నికల బరిలో దిగుతోంది. ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. అవకాశం దక్కితే కీలక పదవిని అధిష్టించడానికే ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో నిలుస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఠాక్రేల కలల పంట అయిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఈ సారైనా వారికి దక్కుతుందా?