Begin typing your search above and press return to search.

ఇస్లామాబాద్‌ లో శివసేన కలకలం

By:  Tupaki Desk   |   6 Aug 2019 5:24 PM GMT
ఇస్లామాబాద్‌ లో శివసేన కలకలం
X
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌ లో శివసేన కలకలం రేపింది. పాకిస్తాన్‌ లో శివసేన ఏమిటా అనుకోవద్దు.. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా పార్లమెంటులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు, ఆయన ఫొటోలతో ఇస్లామబాద్‌ లో బ్యానర్లు వెలిశాయి. అనేక చోట్ల ఇలాంటి బ్యానర్లు కనిపించడంతో పోలీసులు వాటిని తొలగిస్తున్నారు. అయితే, వీటిని ఎవరు ఏర్పాట్లు చేశారన్నది ఇంతవరకు తెలియలేదు.

‘‘ఈ రోజు జమ్మూకశ్మీర్‌.. రేపు బలూచిస్తాన్.. ప్రధాని మోదీ అఖండ హిందూస్తాన్ కల నెరవేరుస్తారన్న నమ్మకం ఉంది’ అంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు వేసి వాటిని ఇస్లామబాద్‌ లో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. దీనికి అఖండ భారత్ చిత్రం కూడా జోడించడంతో అది పాకిస్తాన్‌ లో పెను సంచలనంగా మారింది.

పాకిస్తాన్ సివిలియన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (ఐబీ) - మిలిటరీ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ ఐ వంటివన్నీ ఉండే రెడ్ జోన్ ప్రాంతంలో ఇలాంటి బ్యానర్లు పెద్దసంఖ్యలో వెలియడం సంచలనంగా మారింది. ఈ ప్రాంతంలోనే ఇతర దేశాల ఎంబసీలు కూడా ఉన్నాయి. దేశ నిఘా కేంద్రాల హెడ్ క్వార్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే ఇలా భారత్ అనుకూల పోస్టర్లు ఏర్పాటు చేయడంతో పాక్ ప్రభుత్వం షాక్ తింది. రెడ్ జోన్‌ తో పాటు కోషార్ - అబ్‌ పారా ప్రాంతాల్లోనూ ఇలాంటి బ్యానర్లు కనిపించాయి.

దీంతో పోలీసులు ఆ సమీపంలోని బిల్డింగులు - హోటళ్ల వద్ద ఉన్న సీసీ కెమేరాల ఫుటేజ్‌ ను పరిశీలిస్తున్నారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారో తెలసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇస్లామాబాద్‌ లో బ్యానర్లు కట్టాలంటే కేపిటల్ డెవలప్‌ మెంట్ అథారిటీ అనుమతులు తీసుకోవాలి. ఈ సంస్థకు తెలియకుండా అక్కడ బ్యానర్లు కట్టడం కుదరదు. పైగా ప్రభుత్వ వ్యతిరేక బ్యానర్లు అక్కడ నిషేధం. అయినా.. రాజధానిలో ఇంత కీలక ప్రాంతంలో భారత అనుకూల పోస్టర్లు.. మోదీ అనకూల పోస్టరు పెట్టడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తలపట్టుకుంటోంది.