Begin typing your search above and press return to search.

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఆమేనా?

By:  Tupaki Desk   |   3 Dec 2021 10:30 AM GMT
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఆమేనా?
X
కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా.. ఆ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని భావజాలం.. అంతకు మించిన సిద్ధాంతాలు తమ సొంతమని చెప్పే కమలనాథులు.. కాలంతోపాటు కాంగ్రెస్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో వ్యవహరిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లోని బీజేపీ ముఖ్యమంత్రుల్ని.. మార్చేస్తున్నారు.

కారణం ఏమిటన్న దానికి సూటిగా సమాధానం చెప్పని వారి తీరు.. కాంగ్రెస్ పార్టీ గతంలో వ్యవహరించిన తీరుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉందన్న విమర్శ వినిపిస్తోంది.

వరుస పెట్టి ముఖ్యమంత్రుల్ని మార్చటం.. సీల్ట్ కవర్ సీఎంలతో కర్ర పెత్తనం చేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ మధ్యనే కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన యడ్యూరప్పను పదవి నుంచి దింపేసి..ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మైని నియమించటం తెలిసిందే.

ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి నాలుగు నెలలు కాక ముందే.. ఆయన స్థానంలో మరొకరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

నాలుగు నెలల క్రితం యడ్డీని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపటానికి కారణం ఏమిటన్న దానిపై ఇప్పటివరకు కమలనాధులు క్లారిటీ ఇవ్వలేదు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన వైనంపై గుర్రుగా ఉన్న యడ్డీ.. ప్రాంతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు వీలుగా.. ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా చెప్పే కేంద్రమంత్రి శోభ కరంద్లాజేను ప్రయోగిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం సీఎంగా ఉన్న బసవరాజ్ ను పదవి నుంచి దింపేసి.. శోభను సీఎం చేసే ఆలోచనలో మోడీషాలు ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. యడ్డీ తన దూకుడు తగ్గించి.. పార్టీ ఏర్పాటుపై పునరాలోచనలో పడే అవకాశం ఉందంటున్నారు. యడ్డీ పార్టీ పెట్టకుండా ఉండేందుకు ప్రయోగిస్తున్న శోభ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.