Begin typing your search above and press return to search.

షాక్.. పోలీసులే బస్సుల్ని తగలబెడుతున్నారా?

By:  Tupaki Desk   |   16 Dec 2019 5:00 AM GMT
షాక్.. పోలీసులే బస్సుల్ని తగలబెడుతున్నారా?
X
పౌరసత్వ సవరణ బిల్లుతో దేశంలోని పలు ప్రాంతాలు నిరసనలతో అట్టుడిగిపోతున్న వైనం తెలిసిందే. మరి.. ముఖ్యంగా ఈశాన్య భారతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఆదివారం ఢిల్లీలోని జామియా వర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగటంతో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసు హెడ్ క్వార్టర్స్ ముందు బైఠాయించిన విద్యార్థులు నిరసనలకు దిగటం.. అనంతరం వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయటం.. విద్యార్థులు రాళ్లు విసరటం లాంటివి చోటు చేసుకున్నాయి. దీంతో.. అక్కడి పరిస్థితి ఒక్కసారిగా మారింది. నిరసనకారులు తమ నిరసనల్లో భాగంగా మూడు బస్సుల్ని.. వివిధ వాహనాల్ని నిప్పు పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే.. దీని వెనుక అసలు నిజం వేరే ఉందంటూ ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బస్సుల్ని కాల్చటానికి పోలీసులే వాటిని నిప్పు పెడుతున్నట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. తాను చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ వీడియోల్ని బయటకు తీసుకొచ్చారు.

ఈ వీడియోలలో ధ్వంసమైన బస్సులకు నిప్పు అంటించేందుకు పోలీసులు పెట్రోల్ ను క్యాన్లతో తీసుకెళుతున్న వైనం కనిపిస్తోంది. బీజేపీ దారుణ రాజకీయాలకు ఈ వీడియోలు.. ఫోటోలే సాక్ష్యమని ఆయన చెబుతున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పని చేస్తారన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు వీలుగా ఇలాంటివి చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తమ మీద వచ్చిన ఆరోపణల్ని ఢిల్లీ పోలీసులు తిప్పి కొడుతున్నారు. నిరసనకారులే బస్సులకు నిప్పు అంటిస్తున్నారని.. అందులో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేస్తున్నారు. వారి మాటలు నమ్మేలా ఉన్నప్పటికీ.. వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపించేది మాత్రం వారి మాటలకు భిన్నంగా ఉండటం ఇప్పుడీ వ్యవహారం మరో సంచలనంగా మారుతుందనటంలో సందేహం లేదు.