Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు భారీ షాక్: సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం

By:  Tupaki Desk   |   8 Oct 2021 10:30 AM GMT
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు భారీ షాక్: సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం
X
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సీఆర్పీసీ ప్రకారం ప్రాథమిక విచారణ అవసరం లేదని.. ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలనే హక్కు నిందితుడికి లేదని ధర్మాసనం ప్రకటించింది.

ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుపకుండా సీబీఐ కేసు నమోదు చేయడంపై ఏపీ మంత్రి సురేష్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సురేష్ దంపతుల వాదనను హైకోర్టు సమర్థించింది. సీబీఐ అభియోగాలను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో లోపాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. మరోసారి ప్రాథమిక విచారణ జరపాలని ఆదేశించింది.

హైకోర్టు తీర్పుపై సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసి విచారణ కొనసాగించాలని తీర్పునిచ్చింది.

గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో ఏపీ మంత్రి సురేష్ దంపతులకు చుక్కెదురైంది. ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ తోపాటు ఆయన భార్య విజయలక్ష్మీపై 2016లో కేసు నమోదైంది. ప్రస్తుతం విజయలక్ష్మీ ఇంకా సర్వీసులో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులతో 2017లో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో విచారణను నిలిపివేయాలని సురేష్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో సీబీఐ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సీబీఐ. చివరకు ఈ కేసులో సీబీఐ పైచేయి సాధించింది. సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీ మంత్రి సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది.