Begin typing your search above and press return to search.

బీజేపీ, జనసేనకు షాకేనా ?

By:  Tupaki Desk   |   21 Jan 2022 4:32 AM GMT
బీజేపీ, జనసేనకు షాకేనా ?
X
తాజాగా వెల్లడైన సర్వే రిపోర్టు ప్రకారమైతే మిత్రపక్షాలకు షాక్ తప్పేలా లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే పేరుతో సీ ఓటర్-ఇండియా టు డే సంస్థలు మూడ్ ఆఫ్ ది నేషన్ కనుక్కునేందుకు సర్వే చేశాయి. ఈ సర్వేలో మిత్రపక్షాలకు గట్టి షాక్ తప్పదని తేలిపోయింది. జనాలు అసలు బీజేపీ, జనసేన పార్టీలను పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. ఎందుకంటే ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి తగ్గలేదని తాజా సర్వే చెబుతోంది.

ఓటీఎస్ వ్యతిరేకత, విశాఖ ఉక్కు ఉద్యమం, పోలవరం, అమరావతి, ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల గోడు, మందుబాబుల తిప్పలు, ఇసుక కష్టాలు, నిర్మాణ కూలీలు రోడ్డున పడటం ఇవన్నీ ఈ స్థాయిలో ఏపీలో కనిపిస్తుంటే మరి ఈ సర్వేలో జగనే గెలుస్తాడని చెప్పడం కాస్త ఆశ్చర్యమే.

సర్వే చెప్పినదాని ప్రరకారం ఎంపీ సీట్లయినా, అసెంబ్లీ సీట్లయినా వైసీపీ ఖాతాలోనే పడతాయని తేలింది. అయితే వైసీపీకి ఎన్నిసీట్లు వస్తాయనే విషయంపై క్లారిటీ లేదు. ఏదేమైనా మళ్ళీ అధికారం మాత్రం జగన్ దే అని సర్వేలో తేలింది. ఇదే సమయంలో మిత్రపక్షాలకు లోక్ సభ లో ఒక్క సీటు కూడా రాదని తేలిందట. రాబోయే ఎన్నికల్లో అధికారం మనదే అంటు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు సమావేశాలు పెట్టినా ఒకటే ఊదరగొడుతున్నారు.

అధికారం తమదే అని చెబుతున్నదే వాస్తవమైతే మరి లోక్ సభ సీట్లు కూడా గెలుచుకోవాలి. ఎందుకంటే మెజారిటీ అసెంబ్లీ సీట్లు గెలవనిదే లోక్ సభ సీట్లు గెలవడం సాధ్యం కాదు. తాజా సర్వేలో మిత్రపక్షాలకు ఒక్క పార్లమెంటు సీటు కూడా రాదని తేలిందంటే అసెంబ్లీ సీట్లలో గెలుపుపైన కూడా అనుమానం వస్తోంది. కాబట్టి అధికారం అందుకునే విషయంలో వాళ్ళద్దరిదీ కేవలం భ్రమలు మాత్రమే అర్ధమవుతోంది.

క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్దితులు ఏమిటనేది వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే నేతలను, శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు పార్టీల అధినేతలు అందరూ చెప్పే మాటలనే వీర్రాజు, పవన్ కూడా చెబుతున్నారంతే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డే తిరిగి అధికారంలోకి వస్తారని సర్వేలో తేలింది.

అయితే, ఈ సర్వే శాంపిల్ సైజ్ తక్కువ. . మామూలుగా రెండున్నరేళ్ళ పాలన తర్వాత ఎంతోకొంత జనాల్లో అసంతృప్తి మొదలవ్వటమో లేకపోతే పెరగటమో సహజమే. కానీ ప్రజాదరణ తగ్గలేదంటే బహుశా అమలవుతున్న సంక్షేమ పథకాలు కారణమై ఉండాలి... లేదంటే సర్వేలో శాస్త్రీయతపై ఏవైనా పొరపాట్లు ఉండాలి.