Begin typing your search above and press return to search.

ఐపీఎల్ కు ఇంగ్లండ్ క్రికెటర్ల షాక్

By:  Tupaki Desk   |   12 Sep 2021 10:47 AM GMT
ఐపీఎల్ కు ఇంగ్లండ్ క్రికెటర్ల షాక్
X
కఠినమైన షెడ్యూల్.. బయో-బబుల్ కరోనా నిబంధనల కారణంగా చాలా మంది ఇంగ్లాండ్ ఆటగాళ్ళు రాబోయే ఐపీఎల్ 2021 రెండో దశ నుంచి వైదొలగుతున్నారు. ఇప్పటికే జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ వంటి వారు టోర్నమెంట్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు.

ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్ చేరారు. లీగ్‌లో డేవిడ్ మలన్ పంజాబ్ కింగ్స్ తరుఫున ఆడుతుండగా.., జానీ బెయిర్ షో మన హైదరాబాద్ సన్ రైజర్స్ కు కీలక ఆటగాడిగా ఉన్నాడు. క్రిస్ వోక్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ మలాన్ స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఐడెన్ మక్రామ్‌ని నియమించింది.

మలన్, బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్ ఇంగ్లాండ్ టి 20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యారు. ప్రపంచ కప్ తర్వాత ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్‌లో వీరు పాల్గొననున్నారు..

ఇది ఈ ముగ్గురు ఆటగాళ్లను నాలుగు నెలలకు పైగా ఇంటి నుంచి దూరంగా ఉంచేలా చేస్తుంది. ఈ టోర్నమెంట్‌లన్నింటిలోనూ వారు ఎల్లప్పుడూ బయో బబుల్‌లో ఉండాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన పని. ఫలితంగా వారు శారీరకంగా అలసిపోవడం ఖాయం. క్వారంటైన్ ఆంక్షల కారణంగా వారి మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చు. కీలకమైన ఐసీసీ టీ20, యాషెస్ సిరీస్ ఉన్న కారణంగానే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరమైనట్టు తెలుస్తోంది.

ఇప్పుడు ఐపీఎల్ 2021లో 10 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రమే ఆడనున్నారు. వారు ఇయోన్ మోర్గాన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, సామ్ కర్రాన్, టామ్ కర్రాన్, జార్జ్ గార్టన్.

ఐపిఎల్ 2021 రెండో సగం సెప్టెంబర్ 19న యుఏఈలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు.