Begin typing your search above and press return to search.

సవాంగ్ కి మళ్ళీ షాక్.. విపక్షాలకు కూడా...?

By:  Tupaki Desk   |   17 Feb 2022 7:23 AM GMT
సవాంగ్ కి మళ్ళీ షాక్..  విపక్షాలకు కూడా...?
X
పాత డీజీపీ గౌతమ్ సవాంగ్ కి రెండు రోజుల వ్యవధిలోనే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిజానికి ఆయన డీజీపీగానే రిటైర్ అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ సీన్ చూస్తే రివర్స్ అయింది, మధ్యాహ్నం వరకూ డీజీపీగా ఉన్న మనిషి ఆ తరువాత మాత్రం మాజీగా మారిపోయారు. ఈ విషయంలో ఆయనకు ఒక రకంగా గట్టి షాక్ తగిలింది అనే అంతా అనుకున్నారు. ఆయన సైతం తన విధులను డీజీపీగా కంటిన్యూ చేస్తూ హ్యాపీగా సెలవు తీసుకోవాలనుకుంటే ఇలా జరిగింది.

దీని మీద విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. డీజీపీని ఫుల్లుగా వాడుకుని ఇలా కరివేపాకుని చేస్తారా అని టీడీపీ సహా అన్ని పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే తెర వెనక అసలు ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. డీజీపీ ఏం తప్పు చేశారో కూడా జనాలకు చెప్పాలని కూడా ఆయన కోరారు.

ఈ నేపధ్యంలో ప్రభుత్వం కేవలం నలభై ఎనిమిది గంటల వ్యవధిలో గౌతమ్ సవాంగ్ కి మరో షాక్ ఇచ్చేసింది. అదేంటి అంటే ప్రతిష్టాత్మకమైన ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిని ఆయనకు కట్టబెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి, ఈ పదవిలో సవాంగ్ రిటైర్మెంట్ తో సంబంధం లేకుండా ఇప్పటి నుంచి అయిదేళ్ల పాటు కొనసాగుతారు.

ఈ పదవి చాలాకాలంగా ఖాళీగా ఉంది. చంద్రబాబు హయాంలో పిన్నమనేని ఉదయభాస్కర్ చైర్మన్ గా ఉండేవారు. ఆయన పదవీకాలం ముగిసాక ఇంచార్జితో కధ నడిపిస్తున్నారు. పైగా ఇపుడు ఏపీపీఎస్సీ ద్వారా కొత్తగా జాబ్స్ కోసం నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

దాంతో కీలకమైన ఈ పదవిని సవాంగ్ కి అప్పగించడం ద్వారా జగన్ ఆయనకు మరోసారి షాక్ ఇచ్చారా అన్న చర్చ వస్తోంది. అంతే కాదు, సవాంగ్ మీద పూర్తి ప్రేమానురాగాలను కనబరచిన విపక్షాలకు కూడా షాక్ ఇచ్చారా అన్న చర్చ కూడా వస్తోంది. నిజానికి దీని వెనక జగన్ పక్కా వ్యూహం ఉంది అంటున్నారు.

చాలా కాలం క్రితమే సవాంగ్ కి ఈ పదవి ఇవ్వాలనుకున్నా దాన్ని స్మూత్ గా ఇస్తే విపక్షాలు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. సవాంగ్ కి బహుమానం ఇచ్చారని కూడా కామెంట్స్ చేసేవారు చేస్తారు. అందుకే సవాంగ్ కి పనిష్మెంట్ ఇచ్చినట్లుగా ఏ పోస్టింగులూ లేకుండా రెండు రోజులు గాలిలో పెట్టినట్లుగా పెట్టి తను ఇవ్వాలనుకున్న పోస్టు ఇచ్చారని అంటున్నారు.

ఇపుడు విపక్షాలు కూడా సవాంగ్ విషయంలో ఏమీ అనే సీన్ లేదని అంటున్నారు. పైగా ఒకాయన సవాంగ్ కి తగిన శాస్తి జరిగింది అని కూడా అనేసారు. మరి ఇపుడు ఏమంటారో అని కూడా వైసీపీ నుంచి వస్తున్న చర్చ. మొత్తానికి గౌతమ్ సవాంగ్ ఎపిసోడ్ కాదు కానీ ట్విస్టుల మీద ట్విస్టులతో జగన్ తాను అనుకున్నదే చేశారని మాత్రం అంటున్నారు అంతా.