Begin typing your search above and press return to search.

స్మితా సబర్వాల్ కు షాక్.. రూ.15 లక్షలు చెల్లించాల్సిందే హైకోర్టు ఆదేశం

By:  Tupaki Desk   |   3 May 2022 4:28 AM GMT
స్మితా సబర్వాల్ కు షాక్.. రూ.15 లక్షలు చెల్లించాల్సిందే హైకోర్టు ఆదేశం
X
ఐఏఎస్ అధికారిణి.. తెలంగాణ రాష్ట్ర సీఎంవోలో పని చేసే స్మితాసబర్వాల్ కు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఎంలో కీలక అధికారిణిగా.. సీఎం కేసీఆర్ కోర్ టీంలో సభ్యురాలిగా వ్యవహరిస్తున్న ఆమెకు సంబంధించిన ఒక ఉదంతం ఆ మధ్యన సంచలనంగా మారటం తెలిసిందే. ఆమె ఒక పార్టీకి హాజరు కావటం.. ఆ డ్రెస్సు గురించి ఒక వార్తను పబ్లిష్ చేయటంతో పాటు.. ఫోటో కూడా వేశారు.

దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన స్మితా సభర్వాల్.. సదరు ఇంగ్లిషు మీడియా సంస్థపై మండిపడ్డారు. తన ఫోటోను అవమానకరంగా పబ్లిష్ చేసినందుకు పరువునష్టం దావాను వేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమె వేసిన పరువునష్టం దావాకు అవసరమైన నిధుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల మొత్తాన్ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో.. స్మిత సబర్వాల్ వ్యక్తిగత కేసుకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయటంపై సదరు మీడియా సంస్థతో పాటు.. మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో.. ఈ అంశంపై విచారణ సాగింది. తాజాగా ఈ అంశంపై విచారణను పూర్తి చేసిన హైకోర్టు.. స్మితా సభర్వాల్ వ్యక్తిగత కేసుకు తెలంగాణ ప్రభుత్వం ఏ రీతిలో నిధుల్ని విడుదల చేస్తుందని.. దానికి ప్రాతిపదిక ఏమిటంటూ ప్రశ్నించింది. స్మితా సబర్వాల్ వ్యక్తిగత కేసుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయటంపై విస్మయం వ్యక్తం చేసింది.

ఒక ప్రైవేటు వ్యక్తి.. మరో ప్రైవేటు సంస్థపై కేసు వేస్తే ప్రజాప్రయోజనం కాదన్న హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయం అసమంజసం.. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. అంతేకాదు.. ప్రభుత్వం చెల్లించిన రూ.15 లక్షల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని స్మిత సబర్వాలకు హైకోర్టు ఆదేశాలుజారీ చేసింది. 90 రోజుల్లో రూ15 లక్షల మొత్తాన్ని స్మితసభర్వాల్ నుంచి వసూలు చేయాలని కోర్టు పేర్కొంది. ఈ పరిణామం స్మిత సబర్వాల్ కు షాక్ తగిలినట్లేనన్న మాట వినిపిస్తోంది.