Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు హైకోర్టు షాక్‌: మూడు రాజ‌ధానుల విచార‌ణ 100 రోజులు వాయిదా!

By:  Tupaki Desk   |   3 May 2021 9:44 AM GMT
జ‌గ‌న్‌కు హైకోర్టు షాక్‌:  మూడు రాజ‌ధానుల విచార‌ణ  100 రోజులు వాయిదా!
X
ఏపీ సీఎం జ‌గ‌న్.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూడు రాజ‌ధానుల అంశంపై హైకోర్టు మ‌రోసారి కొర‌డా ఝ‌ళిపించింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న విచార‌ణ‌ను దాదాపు 100 రోజులపైగానే వాయిదా(ఆగ‌స్టు 23) వేసింది. దీంతో ఇప్ప‌ట్లో జ‌గ‌న్ ఆశ‌లు, క‌ల‌లు నెర‌వేరేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిపై వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. ఇది కేవ‌లం ఓ సామాజిక వ‌ర్గాన్ని దృష్టిలో ఉంచుకుని చేసిందేన‌ని పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలో అమ‌రావ‌తిలో ల్యాండ్ మాఫియా భూక‌బ్జాల‌కు పాల్ప‌డింద‌ని.. అసైన్‌మెంట్ భూములు కొంద‌రు అప్ప‌టి టీడీపీకి అనుకూలంగా ఉన్న‌వారు ముందుగానే కొనుగోలు చేసి.. రైతుల‌కు అన్యాయం చేశార‌ని పేర్కొంటూ.. మూడు రాజ‌దానుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అయితే.. తాము ఎన్నో ఆశ‌లు పెట్టుకుని ఇచ్చిన భూముల‌ను ఇప్పుడు అర్ధంత‌రంగా ఎలా వ‌దిలేస్తారు? రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం ఎంత వ‌ర‌కైనా పోరాడతాం అంటూ.. అక్క‌డి రైతులు నిల‌బడ్డారు.

ఈ నేప‌థ్యంలోనే మూడు రాజ‌ధానుల విష‌యంపై కోర్టును ఆశ్ర‌యించారు. వాస్త‌వానికి మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్‌ కూడా ఆమోదించారు. అయితే ఈ వ్యవహారాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ ఓ స్ధాయి వరకూ జరిగిన తర్వాత ఈ ఏడాది జనవరిలో ఛీఫ్‌ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీపై వెళ్లిపోయారు. దీంతో త‌ర్వాత దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ప్ర‌స్తుతం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. అరూప్ గోస్వామి `మ‌ళ్లీ మొద‌టి నుంచి` విచారిస్తామ‌ని.. ఇటీవ‌ల పేర్కొన్నారు.

ఫ‌లితంగా.. మూడు రాజ‌ధానులపై విచారణ పూర్తిగా మొదటికొచ్చింది. ఈ క్ర‌మంలో మూడు రాజధానుల పిటిషన్లపై మార్చిలో విచారణ ప్రారంభించిన జస్టిస్‌ అరూప్‌ గోస్వామి ధర్మాసనం.. ఆ తర్వాత విచారణను మే 3కు వాయిదా వేసింది. ఇవాళ మరోసారి విచారణ జరిగినా తిరిగి ఆగస్టు 23కు వాయిదా వేసింది. దీంతో రాజధానుల తరలింపు వ్యవహారం మరింత ఆలస్యం కాబోతోంది. ఆగస్టులో విచారణ ప్రారంభమైనా ఇది ఎప్పటికల్లా పూర్తవుతుందో చెప్పలేని పరిస్ధితి. దీంతో రాజధాని తరలింపు ఎప్పుడు జ‌రుగుతుంద‌నే విష‌యం పెద్ద మిస్ట‌రీగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.