Begin typing your search above and press return to search.

పిన‌పాక టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన జెడ్పీటీసీ

By:  Tupaki Desk   |   25 Jun 2022 7:30 AM GMT
పిన‌పాక టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన జెడ్పీటీసీ
X
భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం ఆ జిల్లా టీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా కూడా ఉన్న కాంతారావు సొంత మండ‌లంలోనే ఎదురుదెబ్బ తిన్నారు. పిన‌పాక నియోజ‌క‌వ‌ర్గంలోని క‌ర‌క‌గూడెం టీఆర్ఎస్ జెడ్పీటీసీ కొమరం కాంతారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేర‌కు హైద‌రాబాద్ లోని గాంధీ భ‌వ‌న్ టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై జెడ్పీటీసీ కాంతారావు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీలకు, గిరిజనులకు పోడు భూముల పట్టాలిస్తానని ఇవ్వలేదన్నారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన స్వప్రయోజనాల కోసం పదవిని వాడుకుంటున్నాడని ఆయ‌న మండిప‌డ్డారు.

రేగా కాంతారావుకి ఇసుక దందాలు, భూకబ్జాలు, సెటిల్మెంట్లు తప్ప వేరే ధ్యాస లేద‌ని నిప్పులు చెరిగారు. స్థానిక ప్రజాప్రతినిధుల‌ను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్‌ఎస్‌ పార్టీలో గత మూడేళ్లుగా వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్నాయ‌ని చ‌ర్చ ప్ర‌జ‌ల్లో జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత‌ తాటి వెంకటేశ్వర్లు కూడా కాంగ్రెస్ లో చేరార‌ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు సొంత మండలమైన కరకగూడెం జడ్పీటీసీ కొమరం కాంతారావు తన రాజీనామా చేయడంతోపాటు అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేర‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంటున్నారు.

వ‌రుస‌గా పార్టీ నేత‌లు రాజీనామాలు చేసి కాంగ్రెస్ లో చేరుతుండ‌టంతో గులాబీ పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని చెప్పుకుంటున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇంకా ఎంత మంది పార్టీని వీడతారోనని అధికార పార్టీ నాయకులు అంచనాలు వేస్తున్నార‌ని స‌మాచారం.

ఇంకా ఎవ‌రైనా నేత‌లు కాంగ్రెస్ తో ట‌చ్ లో ఉన్నారా అనే విషయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఇంటి పోరు లేకుండా జాగ్రత్త తీసుకోవడంతోపాటు బలమైన నాయకులు పార్టీని వీడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.