Begin typing your search above and press return to search.

రేవంత్‌కు షాక్‌.. ప‌క్క‌ నియోజ‌క‌వ‌ర్గం ఆశ‌ల‌పై నీళ్లు..!

By:  Tupaki Desk   |   17 May 2022 4:29 AM GMT
రేవంత్‌కు షాక్‌.. ప‌క్క‌ నియోజ‌క‌వ‌ర్గం ఆశ‌ల‌పై నీళ్లు..!
X
టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌ ప‌క్క నియోజ‌క‌వ‌ర్గంపై పెంచుకున్న ఆశ‌లు అడియాశ‌ల‌యిన‌ట్లేనా..? ఇక్క‌డ తొలిసారిగా కాంగ్రెస్ జెండా ఎగ‌రేయాల‌న్న క‌ల‌లు క‌ల్ల‌లేనా..? ఇక ఆ స్థానం హ‌స్తం చేతికి చిక్క‌న‌ట్లేనా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎక్క‌డో కాదు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని నారాయ‌ణ‌పేట నియోజ‌క‌వ‌ర్గం. రేవంత్ రెండుసార్లు ఘ‌న విజ‌యం సాధించిన కొడంగ‌ల్ ప‌క్కనే ఉన్న‌ది నారాయ‌ణ‌పేట. నియోజ‌క‌వ‌ర్గాల‌ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణలో భాగంగా 2009లో కొత్త‌గా ఏర్ప‌డింది ఇది. 2009లో తొలిసారే టీడీపీ అభ్య‌ర్థి ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్థి సూగ‌ప్ప‌పై గెలుపొందారు.

2014లో మ‌ళ్లీ టీడీపీయే ఇక్క‌డ గెలుపొందింది. కానీ అభ్య‌ర్థి మారారు. టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన రాజేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్య‌ర్థి కుంభం శివ‌కుమార్ రెడ్డిపై ఘ‌న విజ‌యం సాధించారు. కానీ 2018 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి లెక్క‌ల‌న్నీ మారిపోయాయి. టీడీపీ నుంచి గెలిచిన రాజేంద‌ర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేర‌గా.. టీఆర్ఎస్ నుంచి బ‌రిలో నిలిచిన శివ‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అయితే.. రాజేంద‌ర్ రెడ్డి మంత్రాంగం ప‌ని చేసి ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ టికెట్ తెచ్చుకొని గెలుపొందారు.

కానీ.. కాంగ్రెస్ లో శివ‌కుమార్ ప‌ప్పులు ఉడ‌క‌లేదు. ఆయ‌న‌కు టికెట్ రాకుండా సీనియ‌ర్లు చ‌క్రం తిప్పి స‌రాఫ్ కృష్ణ‌కు ఇప్పించుకున్నారు. దీంతో శివ‌కుమార్ రెడ్డి స్వ‌తంత్రంగా పోటీ చేసి గ‌ణ‌నీయ‌మైన ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ర‌తంగ్ పాండురెడ్డి కూడా అత్య‌ధిక ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన స‌రాఫ్ కృష్ణ‌కు డిపాజిట్ ద‌క్క‌లేదు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్.. గెలుపూ త‌న‌దేన‌ని భావిస్తున్న నారాయ‌ణ‌పేట జిల్లా అధ్య‌క్షుడు కుంభం శివ‌కుమార్ రెడ్డి పార్టీకి ఊహించ‌ని షాక్ ఇచ్చారు. ఆయ‌న అత్యాచార ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుండ‌డ‌మే ఇందుకు కార‌ణం. కాంగ్రెస్ పార్టీకే చెందిన మ‌హిళా నేత‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేసి ప‌లుమార్లు అత్యాచారం చేశార‌ట‌. ఆమె తాజాగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న బండారం బ‌య‌ట‌ప‌డింది. ఈ ఆరోప‌ణ‌లే నిజ‌మైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ కాదు క‌దా పార్టీ నుంచే స‌స్పెండ్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది.

బ‌ల‌మైన నేత‌గా పేరున్న‌ శివ‌కుమార్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ఆర్థికంగా ఆదుకోగ‌ల‌రు కూడా. పీకే చేయించిన స‌ర్వేలో కూడా కాంగ్రెస్ నుంచి ఆయ‌నే ముంద‌జంతో నిలుస్తార‌ని తేలింద‌ట‌. ఇపుడు ఈ లైంగిక ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న రాజ‌కీయ జీవితానికి స‌మాధి ప‌డిన‌ట్లే అని తెలుస్తోంది. పైగా ఆర్థికంగా సంప‌న్నుడైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి ముచ్చ‌ట‌గా మూడోసారి గెలిచేందుకు వ్యూహాలు ప‌న్నుతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో ఈయ‌న‌కు కూడా మంచి పేరు ఉంది. ప్ర‌జ‌లంద‌రూ ఈయ‌న‌ను ప్రేమ‌గా దొర అని పిలుచుకుంటారు. ఇలాంటి ప‌రిస్థితిలో.. కాంగ్రెస్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోని 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేయాల‌ని భావిస్తున్న త‌రుణంలో పార్టీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స‌మీప నియోజ‌క‌వ‌ర్గ‌మే చికాకులు సృష్టిస్తుండ‌డం ఆ పార్టీకి మింగుడు ప‌డ‌ని అంశ‌మే. చూడాలి మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో..!