Begin typing your search above and press return to search.

షాకిచ్చే చిట్టి వీడియో.. లాక్ డౌన్ వేళ దొరక్కూడదని ప్రాణాలు తీసుకున్నాడే

By:  Tupaki Desk   |   24 May 2021 4:12 AM GMT
షాకిచ్చే చిట్టి వీడియో.. లాక్ డౌన్ వేళ దొరక్కూడదని ప్రాణాలు తీసుకున్నాడే
X
చిన్న తప్పునకు పెద్ద మూల్యం.. అది కూడా ప్రాణాన్ని పణంగా పెట్టేంతలా. లాక్ డౌన్ వేళ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ.. అధికారులకు టోకరా ఇవ్వాలన్న తొందరలో నిండు ప్రాణం పోయిన వైనం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో చూసిన వారంతా నోట మాట రాని పరిస్థితి. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ వీడియోను చూస్తే.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు.. తప్పు చేసినా పోలీసులకు చిక్కకూడదన్న తీరు.. నిండు ప్రాణం పోవటానికి కారణంగా చెప్పక తప్పదు.

లాక్ డౌన్ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్న వేళ.. అధికారుల తనిఖీని తప్పించుకోవటానికి ఇద్దరు యువకులు చేసిన విన్యాసం ఒకరి ప్రాణాలు పోవటానికి కారణమైంది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం తపాలపూర్ వద్ద.. అటవీ శాఖ అధికారులు తనిఖీ కేంద్రం ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో గేటు దింపి.. వస్తున్న వాహనాల్ని నిలిపి చెక్ చేస్తున్నారు.

ఈ క్రమంలో వేగంగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఒకదశలో ఆగకుండా వెళుతున్న వాహనాన్ని చూసి.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో.. గేటు కాస్త ఎత్తాడు కూడా. కానీ.. బండి మీద వేగంగా వెళుతున్న ఇద్దరు యువకులు.. ముందు వ్యక్తి తల బాగా కిందకు దించేసి తప్పించుకోగా.. వెనుక కూర్చున్న వ్యక్తి వెనక్కి బాగా వంగినా.. గేటుకు తగిలి కింద పడ్దాడు. వాహనం వేగంగా వెళుతున్న క్రమంలో.. గేటుకు తగిలిన వెంటనే ఎగిరి కిందపడ్డాడు.

తన వెనుక కూర్చున్న వ్యక్తి గేటుకు తగిలిపడిపోయాడన్న విషయాన్ని కూడా గుర్తించకుండా దూసుకెళ్లిన రైడర్ యువకుడి తీరు సీసీ కెమేరాల్లో నమోదైంది. మరణించిన వ్యక్తి తాలూకు బంధువులు మాత్రం అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆందోళన చేయటం గమనార్హం. సీసీ ఫుటేజ్ చూసిన వారెవరూ కూడా అలా అనుకునే పరిస్థితి లేదన్న మాట వినిపిస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి.