Begin typing your search above and press return to search.

జగన్ వైరస్ కు టీడీపీ వ్యాక్సిన్ - చంద్రబాబు

By:  Tupaki Desk   |   6 Jan 2022 7:01 AM GMT
జగన్ వైరస్ కు టీడీపీ వ్యాక్సిన్ - చంద్రబాబు
X
పార్టీని యాక్టివేట్ చేయటం కోసం చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళకు టైం టేబుల్ సెట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అమలు చేయాల్సిన నిరసన కార్యక్రమాలను, ఆందోళనలను చంద్రబాబు వివరించారు. ఇకపై వారానికి మూడు రోజులు తమ్ముళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లోనే తిరగాలని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో జనాలంతా బాగా వ్యతిరేకతతో ఉన్నట్లు చెప్పారు. దీన్ని అవకాశంగా తీసుకుని నేతలు, కార్యకర్తలంతా నిరసన కార్యక్రమాలతో జనాల్లోనే ఉండాలన్నారు.

ప్రభుత్వం అంటే భయంతో జనాలెవరు నిరసనలు తెలిపేందుకు బయటకు రావటం లేదని కాబట్టి తమ్ముళ్ళు రోడ్లపైకి వస్తే జనాలు కూడా మద్దతుగా రోడ్డెక్కుతారన్నది చంద్రబాబు ఆలోచన. అందుకనే వారానికి మూడు రోజులు జనాల్లోనే అదీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండాలని చెప్పింది. గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత కమిటిల నియామకం కూడా కావాలన్నారు. జనవరి 8న రైతు సమస్యలపైన, 11వ తేదీన నిత్యావసర ధరలపై నేతలు, కార్యకర్తలంతా ఆందోళనలు చేయాలని పిలుపిచ్చారు.

రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టిందన్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇబ్బంది పెడుతుంటే రాష్ట్రాన్ని మాత్రం జగన్ వైరస్ ఇబ్బంది పెడుతోందన్నారు. జగన్ అనే వైరస్ కు టీడీపీ మాత్రమే విరుగుడుగా పనిచేస్తుందని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా జనాల్లోకి తీసుకెళ్ళటమే జగన్ వైరస్ కు విరుగుడని కూడా చంద్రబాబు వివరించారు. పార్టీ కార్యక్రమాలను సక్రమంగా అమలుచేయలేని నేతలు పార్టీ వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చనే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. యాక్టివ్ గా లేని నేతలు పార్టీకి అవసరం లేదని కూడా స్పష్టంగా చెప్పేశారు.

పార్టీకి పనిచేయకుండా పదవులు రావాలని కోరుకుంటే ఉపయోగం లేదని చెప్పారు. పార్టీలోనే ఉంటు పార్టీకి నష్టంచేసే నేతలను ఎట్టి పరిస్దితుల్లోను ఉపేక్షించేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. వచ్చేవి మామూలు ఎన్నికలు కావు కాబట్టి అందరు కలిసికట్టుగా, ఎఫెక్టివ్ గా పనిచేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు నొక్కి చెప్పారు. వైసీపీ నేతల అరాచకాలను, రౌడీయిజాన్ని ఎదుర్కోవాలంటే ఢీ అంటే ఢీ అనే నేతలే పార్టీకి అవసరమని కూడా వివరించారు.

పార్టీ కార్యాలయంలో ఎంఎల్ఏలు, ఓడిపోయిన అభ్యర్ధులు, పార్టీ ఇన్చార్జీలు, ఎంపీలు, ఓడిపోయిన ఎంపీ అభ్యర్ధుల, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జిలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అయితే ఇక్కడే చంద్రబాబు పొరబాటు చేస్తున్నారు. సమావేశాల్లో తాను మాట్లాడటం కాకుండా నేతలతో మాట్లాడించాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రావటం లేదో అర్థం కావటంలేదు. నేతలతో మాట్లాడిస్తేనే క్షేత్రస్ధాయిలోని ఇబ్బందులు బయటపడతాయి. అలాకాకుండా తానే మాట్లాడితే ఎప్పుడూ జరిగేదే కదాని నేతలు చాలా లైటుగా తీసుకుంటారు. మరి ఈ విషయాన్ని చంద్రబాబు ఎప్పుడు గ్రహిస్తారో.