Begin typing your search above and press return to search.

అమరావతి రైతుల పాదయాత్రకు షాక్.. తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం

By:  Tupaki Desk   |   14 Dec 2021 9:31 AM GMT
అమరావతి రైతుల పాదయాత్రకు షాక్.. తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం
X
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. అర్థరాత్రి నగరంలో తిరుపతి ప్రజల పేరిట ‘మీతో మాకు గొడవలు వద్దు.. మీకు మా స్వాగతం.. మాకు మూడు రాజధానులే కావాలి’ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అమరావతి రైతుల పాదయాత్ర తిరుపతి నగరంలో కొనసాగనున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న మార్గంలోనే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం కలకలం రేపింది.

ఈరోజు తిరుపతి నగరంలో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సాయంత్రంలోపు పాదయాత్ర అలిపిరి వద్దకు చేరుకునే అవకాశం ఉంది. దర్శన టిక్కెట్లు లేకుండా కొండపైకి ఎవరినీ అనుమతించమని అధికారులు తేల్చిచెప్పారు.

అలిపిరి వద్ద గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి తిరుపతి యాత్ర ముగించే యోచనలో అమరావతి రైతులున్నారు. శ్రీవారి దర్శన టిక్కెట్ల కోసం అమరావతి రైతుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సుమారు 500 మంది రైతులకు రెండు, మూడు విడతలుగా దర్శనం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ఈ క్రమంలోనే సోమవారం అమరావతి పరిరక్షణ సమితి ఏపీ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసింది. తిరుపతిలో నిర్వహించాలనుకుంటున్న రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరింది. సభకు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అడ్డుపడుతోందని పిటీషన్ లో రైతుల తరుఫున న్యాయవాదులు హైకోర్టుకు వెల్లడించారు. తిరుపతిలో రాజధాని రైతుల సభకు అనుమతివ్వకుండా పోలీసులు అసంబద్ద కారణాలు చెబుతున్నారని పేర్కొన్నారు.

డీజీపీ, మహా పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారని కోర్టుకు తెలిపారు. సభకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సి జిల్లా ఎస్పీ అని.. అలాంటిది సభమై ఓ డీఎస్పీ అధికారి ఎలా నిర్ణయం తీసుకుంటారని న్యాయవాది పిటీషన్ లో ప్రశ్నించారు. అమరావతి రైతులు దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారణ జరుగనుంది. మరి దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తి రేపుతోంది.