Begin typing your search above and press return to search.

దేశంలో కోవిడ్ నాలుగోవేవ్.. ఈ ఏడాది జూన్ లోనే..

By:  Tupaki Desk   |   28 Feb 2022 5:11 AM GMT
దేశంలో కోవిడ్ నాలుగోవేవ్.. ఈ ఏడాది జూన్ లోనే..
X
దేశంలో థర్డ్ వేవ్ దాదాపుగా ముగిసింది. ఇక ఫోర్త్ వేవ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ కు ముహూర్తాన్ని కూడా సైంటిస్టులు నిర్ణయించారు. సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ కు దాదాపు 6 నెలల గ్యాప్ తీసుకున్న కరోనా.. ఈసారి మాత్రం 4 నెలలకే ఫోర్త్ వేవ్ రూపంలో వస్తోంది.

కరోనా పీడ వదిలిపోయిందని అనుకునే లోపే శాస్త్రవేత్తలు ఈ బాంబు పేల్చారు. నాలుగోవేవ్ కు ఇంకా 4 నెలలు మాత్రమే సమయం ఉందని తేల్చారు. వచ్చే జూన్ లో ఫోర్త్ వేవ్ మొదలవుతుందని.. అది అక్టోబర్ వరకూ కొనసాగుతుందని అంచనా వేశారు. కొద్దిరోజులుగా రోజు వారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో దేశంలో కరోనా మూడో వేవ్ ముగిసినట్లేనని అంటున్నారు. కరోనా నాలుగో దశ జూన్ 22 నాటికి ప్రారంభమవుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. నాలుగో వేవ్ నాలుగు నెలల పాటు కొనసాగుతుందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనావేశారు.

నాలుగో వేవ్ తీవ్రత అనేది వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్ లను బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్ వేవ్ తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలిపారు. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని తాజా పరిశోధకులు అంచనావేశారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

దేశంలో కోవిడ్ వేవ్ లకు సంబంధించి ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనావేయడం ఇది మూడోసారి. ముఖ్యంగా కరోనా థర్డ్ వేవ్ విషయంలో కొద్దిరోజుల తేడాతో దాదాపు ఖచ్చితమైన అంచనావేసింది ఐఐటీ కాన్పూర్ సైటింస్టులు మాత్రమే. ఇప్పుడు వారి అంచనా కూడా నిజం కానుంది.

దేశంలో 2022 ఫిబ్రవరి 26వ తేదీ శనివారం కొత్తగా 10273 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. ఈ సంఖ్య మొన్నటి కంటే 10 శాతం తక్కువ. దీంతో దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,29, 16,117కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి.