Begin typing your search above and press return to search.

కరోనా నుంచి కోలుకోవటానికి ఎంత టైం పడుతుందో తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   13 July 2021 5:14 AM GMT
కరోనా నుంచి కోలుకోవటానికి ఎంత టైం పడుతుందో తెలిస్తే అవాక్కే
X
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ వైద్యుల జాబితాను చూస్తే.. అందులో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు నాగేశ్వరరెడ్డి పేరు తప్పనిసరిగా ఉంటుంది. కొవిడ్ వేళ.. ప్రజల్లో నెలకొన్న సందేహాలకు సమాధానాలు ఇవ్వటంతో పాటు.. కీలక సందర్భాల్లో ఆయన ఇచ్చిన సలహాలు.. సూచనలు తెలుగు ప్రజలకు మేలు చేశాయి. కొవిడ్ బారిన పడిన వేళలోనే కాదు.. దాని బారి నుంచి క్షేమంగా బయటపడిన తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఆయన చెబుతున్న అంశాలు ఆసక్తికరంగా మారాయి.

కరోనా బారిన పడిన వారు కోలుకున్న తర్వాత.. ఆ మహమ్మారి దెబ్బకు కొన్ని అవయువాల మీద మాత్రమే ప్రభావం పడుతుందని చెబుతున్నా.. అందులో నిజం లేదని.. చాలా అవయువాల మీద దాని తీవ్రత ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. మెదడు.. ఊపిరితిత్తులు.. జీర్ణకోశం.. కాలేయం.. కిడ్నీ.. చెవి.. ముక్కు.. గొంతు.. ఎముకలు.. ఇలా అన్ని అవయువాల మీద ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత దాదాపు 41.8 శాతం మంది ఏదో ఒక అనారోగ్యంతో బాధ పడుతున్నారని.. కోవిడ్ నయమైన వారిలో 30 ఏళ్ల వయసులోనే గుండెపోటు.. పక్షవాతం.. బ్లాక్ ఫంగస్ లాంటి ప్రమాదకర వ్యాధులు దాడి చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. షుగర్.. కీళ్లవాతం లాంటి వాటి బారిన పడుతున్నట్లు చెబుతున్నారు.

అంతేకాదు.. కరోనా బారిన పడిన తర్వాత నెల రోజుల్లోనే కోలుకునే వారు ఉన్నప్పటికీ..కోలుకోవటానికి మూడు నెలల సమయం తీసుకుంటున్న వారు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. కరోనా బారిన పడిన తర్వాత అత్యంతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతుున్నారు. సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ 90 శాతం ప్రభావం చూపించినట్లుగా చెబుతున్నారు. డెల్టా ప్లస్ కేసులు తెలంగాణలో ఇప్పటివకు రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని.. ఏపీలో కూడా రెండు కేసులు మాత్రమే నమోదైనట్లుగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

కరోనా తగ్గిన వెంటనే.. తాము విజేతలుగా చెప్పుకుంటున్న వారు చాలాపెద్ద తప్పు చేస్తున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా బారిన పడి.. తర్వాత కోలుకున్న వారు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు శరీరంలో చోటు చేసుకునే మార్పుల్ని గమనించుకోవటం.. వాటికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవటం.. ఏదైనా తేడా వచ్చినట్లుగా తేలితే వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాల మీదకు వస్తుందన్న మాటను వైద్యులు చెబుతున్నారు. అందుకే.. కరోనా నుంచి కోలుకున్నంతనే రిలాక్స్ అయి.. వదిలేయటం తప్పే అవుతుంది. కరోనా బారిన పడినప్పుడు ఎంతలా జాగ్రత్తలు తీసుకుంటారో.. కోలుకున్న మూడు నెలల వరకు ఇలాంటి జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎలాంటి తప్పు జరిగినా సమస్యే అవుతుందన్నది మర్చిపోకూడదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎదురవుతున్న సమస్యలకు ఆసుపత్రులు ఇప్పటివరకు ప్రత్యేక వైద్యం చేయట్లేదు. తాజాగా మాత్రం హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కరోనా అనంతరం ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు పరిష్కారానికి ట్రీట్ మెంట్ మొదలు పెట్టారు. ఇలాంటి సేవల్ని వినియోగించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.