Begin typing your search above and press return to search.

ఐదుసార్లు ఎమ్మెల్యే, మంత్రిగా సేవలు .. అయినా అక్కడ సామాన్యుడిలా..!

By:  Tupaki Desk   |   30 March 2021 12:30 PM GMT
ఐదుసార్లు ఎమ్మెల్యే, మంత్రిగా సేవలు .. అయినా అక్కడ సామాన్యుడిలా..!
X
ప్రస్తుత రోజుల్లో సర్పంచ్ , కార్పొరేటర్ లేదా కౌన్సిలర్‌ , చివరికి వార్డు మెంబర్ గా గెలిచినా కూడా డబ్బు, దర్పం చూపిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే, ఎంపీ అయితే వారి వ్యవహార శైలి వేరే లెవెల్ లో ఉంటుంది. ఒకసారి ఎమ్మెల్యే గా గెలిచి , ఆ తర్వాత ఎమ్మెల్యే గా ఓడిపోయినా కూడా మాజీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ తో జీవితాంతం ఆ హోదా చెప్తూ బ్రతికేస్తారు. ఎక్స్ ఎమ్మెల్యే అని స్టిక్కర్ వేసుకుని తిరుగుతారు. చుట్టూ మందీ మార్బలం పెట్టుకుంటారు. తెగ హడావుడి చేస్తారు. ఇక వారు గతంలో మంత్రులుగా పని చేసిన వారైతే చెప్పాల్సిన పనేలేదు. అయితే , ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా సాదాసీదా జీవనం గడిపే మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారా అంటే ఈ రోజుల్లో అలాంటి మహానుభావులు ఎక్కడ ఉంటారు సినిమాల్లో , పురాణాల్లో తప్ప అని చెప్తారు. కానీ, అలాంటి ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

ఆయన పేరు రెడ్డి సత్యనారాయణ. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. టీటీడీ బోర్డు సభ్యునిగా ఆ శ్రీవారి సేవలో పునీతులైయ్యారు. అలాంటి వ్యక్తి సాధారణ భక్తుడిగా క్యూలైన్ లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విశాఖలోని వడ్డాది వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఐదుసార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రిగా పనిచేసిన సత్యనారాయణ కు వడ్డాదిలో ఎంతోమంది స్నేహితులు, అనుచరులు ఉన్నారు. అయినా, వారెవరికీ సమాచారం ఇవ్వకుండా ఆర్టీసీ బస్సులో వచ్చి , ఓ యువకుడి బైక్ పై కొండపైకి వెళ్లి , సాధరణ భక్తుల వలే రద్దీగా ఉన్నప్పటికీ , తన పలుకుబడి ఉపయోగించుకోకుండా దర్శనం చేసుకున్నారు.

అసలు ఆయన వేషధారణ చూస్తే ఆయన మాజీ మంత్రిగా పని చేశారంటే ఎవరూ నమ్మరు. అలా ఉంటుంది అయన వేషధారణ. గతంలో సీఎం జగన్ ను కలిసేందుకు వెళ్ళగా అక్కడున్న సెక్యూరిటీ సత్యనారాయణను గుర్తు పట్టలేకపోయారు. మాజీ మంత్రిని అని చెప్పినా వినలేదు. అంతలో ఓ రాజకీయ నాయకుడు ఆయన్ను గుర్తిస్తే ,సెక్యూరిటీ సిబ్బందికి అసలు విషయం బోధపడింది. అది ఆయనకున్న ప్రత్యేకత. ఈ తరం రాజకీయ నాయకుల్లో అతి సాధారణ జీవితం గడుపుతున్న ఈ మాజీ మంత్రి కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.