Begin typing your search above and press return to search.

అమ్మ మ‌ర‌ణంలో కొత్త ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   9 Dec 2017 4:31 AM GMT
అమ్మ మ‌ర‌ణంలో కొత్త ట్విస్ట్‌
X
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీ మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతోంది. అమ్మ మ‌ర‌ణంలోని అస‌లు నిజాలు తెలుసుకునేందుకు పళనిస్వామి ప్రభుత్వం రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. అమ్మ మృతిపై రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి నేతృత్వంలో న్యాయవిచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఈ క‌మిష‌న్ ముందు సంచ‌ల‌న అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. అమ్మ‌కు ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్న స‌మ‌యంలో ప్రభుత్వం తరపున నియమితులైన బృందం ఈ రోజు విచార‌ణ‌లో ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌మైన తామే ఆస్పత్రిలో ఉన్న జయను చూడలేక పోయామని విచారణ కమిషన్‌ ముందు వైద్య బృందం చెప్పుకొచ్చింది.

కాగా, గతేడాది సెప్టెంబర్‌ లో ఆరోగ్యం క్షీణించటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలితను చేర్పించ‌గా....దాదాపు మూడు నెలల పాటు చికిత్స అందించినప్పటికీ ఆమె కోలుకోలేదు. డిసెంబర్‌ 5 న గుండెపోటు అధికం కావటంతో ఆమె మృతి చెందారు. ఐతే మూడు నెలల పాటు చికిత్స అందించినప్పటికీ అందుకు సంబంధించిన ఒక్క ఫోటో కానీ వీడియో కానీ మీడియాకు విడుదల చేయలేదు. దీంతో జయలలిత మరణంపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి. అప్పటి సీఎం పన్నీర్‌ సెల్వం ను సైతం జయను చూసేందుకు అనుమతించ లేదు. అమ్మ మరణించే వరకు కూడా ఆమెకు అందిన వైద్యంపై ఎలాంటి సమాచారం లేకపోవటంతో స్వయంగా పన్నీర్ సెల్వమే న్యాయ విచారణకు డిమాండ్‌ చేశారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా అర్ముగ‌స్వామి కమిష‌న్‌ కు ఇప్ప‌టివ‌ర‌కు 27 మంది తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. అమ్మ చికిత్స స‌మ‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ఉన్న డాక్ట‌ర్ బాలాజీ క‌మిష‌న్ ముందు గురువారం హాజ‌రైన సందర్భంగా సంచ‌ల‌న విష‌యాల వెల్ల‌డించారు. అమ్మ‌కు ఎలాంటి చికిత్స అందించారో త‌మ‌కు తెలియ‌దని ఆయ‌న పేర్కొన్నారు. అపోలో ఆస్ప‌త్రిలో త‌మ‌కు క‌నీసం టీవీ కూడా లేని ఓ రూమ్‌ ను కేటాయించార‌ని ఎలాంటి చికిత్స అందుతుందో క‌నీసం వెల్ల‌డించేవారే కాద‌న్నారు. అడ‌పాద‌డ‌పా...బులెటిన్‌ ను త‌మ‌కు చ‌దివి వినిపించేవార‌న్నారు. అమ్మ‌ను ఓ సారి సిటీస్కాన్‌ కు తీసుకువెళుతున్న‌ప్పుడు చుట్టూ కర్టెన్ క‌ట్టార‌ని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌తిరోజూ ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు తాము అలా కూర్చుండిపోయేవాళ్లం త‌ప్పించి ప్ర‌త్యేకంగా ఏ ప‌ని ఉండ‌క‌పోయేద‌ని ఆయ‌న వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా..ఐదుగురు వైద్యుల బృందంలో..కేవ‌లం బాల‌జీ ఒక్క‌రినే జ‌య‌ల‌లిత గ‌దిలోకి పంపడంపై ప‌లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో మ‌రోమారు ఆయ‌న్ను విచారించ‌నున్నారు.

కాగా, అర్ముగ‌స్వామి క‌మిష‌న్ విచార‌ణ‌లో గంగా మరో వందమందికి పైగా ఫిర్యాదులతో కూడిన వినతిపత్రాలు సమర్పించగా వీరికి సైతం సమన్లు పంపాల్సిందిగా ఆర్ముగస్వామి తన సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 12వ తేదీన ఆక్యుపంచర్‌ వైద్యుడు శంకర్ - 13న జయ మేనకోడలు దీప - 14న దీప సోదరుడు దీపక్ - 20న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ - 21న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మెహన్‌ రావు హాజరవ్వాల‌ని స‌మాన్లు పంపించారు. మ‌రోవైపు త‌మ గ‌డువు ఆరునెల‌లు పొడ‌గించాల‌ని అర్ముగ‌స్వామి క‌మిష‌న్ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. విచార‌ణ చేయ‌డం, నివేదిక రూపొందించ‌డం కోసం ఈ స‌మ‌యం కావాల‌ని విన్న‌వించింది.కాగా, ఈ విచార‌ణ‌కు స‌హ‌కరిస్తామ‌ని అమ్మ‌కు చికిత్స చేసిన అపోలో ఆస్ప‌త్రి స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.